Home తెలంగాణ మోడీ సర్కార్ ది ఇక హిందుత్వ అజెండాయేనా? | modi sarkar hindutva ajenda| nda|...

మోడీ సర్కార్ ది ఇక హిందుత్వ అజెండాయేనా? | modi sarkar hindutva ajenda| nda| alliance| parties| trouble| handle

0

posted on Aug 29, 2024 2:22PM

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలు దక్కకపోవడంతో ఒకింత డీలా పడినట్లు కనిపించింది. భాగస్వామ్య పక్షాల మద్దతుతో  లోక్ సభలో ఎలాగోలా తన మాట నెగ్గించుకోగలిగినా, ఇప్పటి వరకూ రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి ఆ వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో భాగస్వమ్యంలో లేని పక్షాల మద్దతు కోసం కూడా వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉండింది. మోడీ సర్కార్ ఆ బలహీనతను గుర్తించిన వైసీపీ వంటి కొన్ని పార్టీలు రాజ్యసభలో తమకున్న సభ్యుల బలాన్ని చూపి ప్రయోజనం పొందాలని భావించాయి. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాజ్యసభలో కూడా ఎన్డీయేకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది.

తాజాగా 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో విజయం సాధించడంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా తన సొంత అజెండా అమలుకు సమాయత్తమైపోతున్నది. బీజేపీ అజెండాను కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అమలు చేయడం భాగస్వామ్య పక్షాలకు ఒకింత ఇబ్బందికరమే అయినా బీజేపీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరుసగా మూడు సార్లు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహించిన బీజేపీ నాలుగో సారి కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమౌతుందని భావించడం లేదు. ఎందుకంటే 2014, 2019 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ సర్కార్ పేరుకే ఎన్డీయే కూటమి ప్రభుత్వం. వాస్తవానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మంది సభ్యుల బలం ఉండటంతో మోడీ పూర్తిగా తన హిందుత్వ అజెండా అములుకు ఇసుమంతైనా వెనుకాడ లేదు. అంతే కాకుండా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కనీస విలువ ఇవ్వలేదు. ముఖ్యంగా రెండో సారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే నామమాత్రమైపోయింది. తెలుగుదేశం సహా పలు భాగస్వామ్య పక్షాలు ఎన్డీయే నుంచి వైదొలిగాయి. కొన్ని భాగస్వామ్య పార్టీలలో చిచ్చు పెట్టి, చీలిక తీసుకు వచ్చి బీజేపీ వాటిని బలహీనపరిచింది.

అయితే 2024 ఎన్నికలలో బీజేపీకి జనం పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. భాగస్వామ్య పక్షాల మద్దతు, అండా లేకుండా ప్రభుత్వాన్ని నడపడం అసాధ్యం అనేలా తీర్పు ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి గట్టి ప్రతిపక్షంగా గళం విప్పడానికి తగినంత బలాన్నిచ్చారు. అదే సమయంలో  రాష్ట్రాలలో బీజేపీ బలం తగ్గుతూ వస్తోంది. పార్టీకి కంచుకోట లాంటి ఉత్తర ప్రదేశ్ లో ఈసారి బీజేపీ స్థానాలు గణనీయంగా తగ్గాయి. దీంతో అప్రమత్తమైన మోడీ సర్కర్ తన అజెండా అమలు విషయంలో ఇంకెంత మాత్రం తాత్సారం చేయరాదని భావిస్తున్నది. 

రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న కారణంతో లోక్ సభలో ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఎందుకంటే లోక్ సభలో ఉన్న బలంలో బిల్లు ఆమోదం పొందినా రాజ్యసభ ఆమోదం సాధ్యం కాదన్న భవనతో విపక్షాల అభిప్రాయాలకు విలువను ఇస్తున్నట్లుగా బీజేపీ బిల్డప్ ఇచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇక ఇప్పుడు తన ప్రభఉత్వం ప్రవేశపెట్టే బిల్లులకు రాజ్యసభ గండం తొలగిపోవడంతో స్పీడ్ పెంచేందుకు రెడీ అయిపోయింది. క్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు, మైనారిటీ బిల్లు ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ బిల్లులకు ఉభయ సభల ఆమోదమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  బీజేపీ అడుగులు హిందూ రాజ్యం గా ఇండియాను మార్చే లక్ష్యం దిశగా పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విపక్షాల విమర్శలను బీజేపీ ఖాతరు చేసే అవకాశం లేదు. అయితే బీజేపీ విధానాలు నిస్సందేహంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఇబ్బందికరంగా మారుతాయి. ముఖ్యంగా తెలుగుదేశం వంటి పార్టీలు బీజేపీ ముస్లిం వ్యతిరేక విధానాలను, హిందుత్వ అజెండాను సంపూర్ణంగా సమర్ధించే పరిస్థితి ఉండదు. మరి ముందు ముందు బీజేపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఇబ్బంది లేకుండా తన అజెండా అమలుకు ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.  

Exit mobile version