posted on Aug 27, 2024 8:08PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహాసభ డెట్రాయిట్లో నిర్వహించాలని నిర్ణయించారు. 2025 జులై మొదటి వారంలో ఈ వేడుకలు జరగనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ మహాసభలకు కో-ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్ చాపలమడుగు, చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్ల నియమితులైనట్లు ‘తానా’ సెక్రటరీ రాజా కసుకుర్తి తెలిపారు. ఈ మేరకు బోర్డు, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
‘తానా’ 2025 మహాసభలు జరిగే నగరాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను తానా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆమోదించారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీకి శ్రీనివాస్ కోనేరు ఛైర్మన్‌గా వ్యవహరించారు. నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి సభ్యులు. ప్రతిపదేళ్ళకు ఒకసారి తానా మహాసభలు డెట్రాయిట్లో జరగడం సంప్రదాయంగా వస్తోంది. 2005, 2015 సంవత్సరాల్లోనూ డెట్రాయిట్ నగరంలోనే ‘తానా’ మహాసభలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా 2025 సంవత్సరం ‘తానా’ మహాసభలను కూడా అక్కడే నిర్వహించాలని ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయించడం విశేషం. డెట్రాయిట్ తెలుగు వారికి దగ్గరగా ఉంటుందని, హాజరయ్యే అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి వీలుగా వుంటుందని ‘తానా’ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
తానా ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల తానాలో పాత తరానికి, కొత్త తరానికి సుపరిచితులు. ఆయన పర్యవేక్షణలో తానా సభలు ఎలాంటి లోటు లేకుండా జరుగుతాయన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే సమన్వయకర్తగా నియమితులైన ఉదయ్ కుమార్ చాపలమడుగు కృష్ణా జిల్లాలోని చల్లపల్లి వాస్తవ్యులు. ‘తానా’లో అనేక కీలక పదవులు నిర్వహించారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ) కార్యనిర్వాహక కమిటీలోనూ ఆయన అనేక కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా, డీటీఏ 25, 40వ వార్షికోత్సవాల సందర్భంగా ఉదయ్ కుమార్ చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డెట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కో-ఆర్డినేటర్‌గానూ ఆయన పనిచేశారు. 2007లో తానా చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్‌గానూ పనిచేశారు. ఈయన ఎవరో కాదు… ప్రముఖ నటుడు, బాబాయ్, దివంగత చలపతి రావు అల్లుడు. అద్భుతమైన ప్రసంగ నైపుణ్యం ఆయన సొంతం. ఆయన ప్రసంగాలు తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు పొందాయి. డెట్రాయిట్లో జరగనున్న తానా సదస్సుకు ప్రతిభావంతులను బాధ్యులుగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోందని ‘తానా’ కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు.