posted on Aug 26, 2024 6:05PM
క్రీడలకు పెద్ద పీట వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో మంచి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై… మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను రేవంత్ రెడ్డి నేడు పంపిణీ చేశారు. మెయిన్స్‌లోనూ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సివిల్స్ ఉత్తీర్ణులై తెలంగాణ ప్రతిష్ఠను పెంచాలన్నారు. తెలంగాణ నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని, మరో 35 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రతి విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తామన్నారు. 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామన్నారు.