posted on Aug 23, 2024 3:32PM
పూణెకి చెందిన నానా సాహెబ్ వాగ్‌చురే కుటుంబం మహారాష్ట్రలో అందరికీ పరిచయం వున్న సంపన్న కుటుంబం. ఈ కుటుంబంలోని ఇద్దరు సోదరులను ‘గోల్డెన్ గైస్’ అని పిలుస్తూ వుంటారు. ఈ కుటుంబానికి చెందిన వారు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఈ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది గ్రాములు కాదు.. వంద గ్రాములు.. కాదు.. ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది, చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్‌లేట్లు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, ఇక మెడలో అయితే అంతకుమించిన పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు.. మొత్తంగా కిలోల కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది.
ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం బయట కు వచ్చిన ఆ గోల్డెన్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు.. నోటిన వేలు వేసుకున్నారు. ఒక నగల దుకాణమే తరలి వచ్చిందా అన్నట్టుగా ఆ ఫ్యామిలీ శ్రీవారి సన్నిధిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో అక్కడున్న భక్తులు అబ్బో ఎంత బంగారమో అంటూ ఆశ్చర్యపోయారు. బంగారు నగల అలంకరణతో దగదగా మెరిసిపోతున్న ఆ ఫ్యామిలీతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. వాళ్ల ఒంటిపై మాత్రమే కాదు.. వారు వచ్చిన కారు కూడా గోల్డ్ కోటే. దీంతో వాళ్లు కారెక్కి వెళ్లేంత వరకు కూడా కనురెప్పలు మూయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు భక్తులు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం.