posted on Aug 22, 2024 2:30PM
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం తొమ్మది నెలల వ్యవధిలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంత వరకూ రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించగలిగారు. ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసించారు. సినీ స్టార్ గా కంటే రాజకీయ నాయకుడిగా మరింత ఎక్కువగా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. నాలుగు దశాబ్దాల తరువాత కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ సిద్ధాంతాలనే అనుసరిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలో రాణించాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే ఆయన తమ్ముడు మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమై గణనీయమైన విజయాన్ని సాధించారు. ఇటీవలి ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానంలో విజయం సాధించి దేశ రాజకీయాలలోనే వంద శాతం ఫలితాన్ని సాధించిన ఏకైక పార్టీగా రికార్డు సృష్టించింది. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన పార్టీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అలాగే తమిళనాట అయితే ఎంజీరామచంద్రన్ ఎడిఎంకే (ఇప్పుడు ఆ పార్టీయే ఏఐఏడిఎంకె) ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తరువాత ఆయన వారసత్వాన్ని జయలలిత అందిపుచ్చుకుని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వీరే కాకుండా మక్కల్ నీధి మయియామ్ (ఎమ్ఎన్ఎమ్) పార్టీని ఏర్పాటు చేసిన విజయకాంత్, ఇంకా భాగ్యరాజ్, శరత్ కుమార్ లు కూడా రాజకీయ ప్రవేశం చేసినప్పటికీ ఎంజీఆర్, జయలలిత స్థాయిని అందుకోలేకపోయారు. వీరిలో విజయకాంత్ మాత్రమే తన ప్రభావాన్ని చాటుకోగలిగారు. అలాగే అశేష అభిమానుల బలం ఉన్న కమల్ హసన్ రాజకీయాలలో ప్రవేశించినప్పటికీ రాణించలేకపోయారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే రాజకీయ అరంగేట్రం ప్రయత్నాలను మొదలు పెట్టి వెనుకడుగు వేశారు.
ఇప్పుడు తాజాగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగంపేరిట పార్టీ ఏర్పాటు చేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. సినీ హీరోగా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కు తోడు ఆయన రాజకీయ ప్రవేశం చేసిన సమయాన్ని బట్టి పొలిటికల్ గా విజయ్ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా విజయ్ కు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కారణంగా చూపుతున్నారు. జయలలిత మరణం తరువాత ఏఐఏ డీఎంకే ఉనికి మాత్రంగా మిగిలిపోవడం, అధికార డీఎంకే కు గట్టి ప్రత్యర్థి లేకపోవడం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఇదే కాకుండా ఇంకా పలు అంశాలు విజయ్ కు అనుకూలంగా మారాయని అంటున్నారు. వ జయలలిత మరణం తరువాత ఏఐఏడీఎంకే బలహీనం కావడంతో ఎమ్ కే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు సరైన ప్రత్యర్థి పార్టీ లేకుండా పోయింది. అలాగే ఏఐఏడీఎంకే పార్టీలోని అంతర్గత విభేదాలు ఆ పార్టీని చీలికలు పేలికలుగా మార్చేశాయి. దీంతో ఏఐఏడీఎంకే నుంచి పెద్ద సంఖ్యలో నేతలు రానున్న రోజులలో విజయ్ పంచన చేరే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ మించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులలో విజయ్ కు ఉన్న పాపులారిటీ ఆ పార్టీకి పెద్ద ఎటు బ్యాంకుగా మారనుంది. విజయ్ బీజేపీ విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, స్వయంగా ఎస్సీ కావడం కూడా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో దళపతి విజయ్ కు ప్లస్ కానుంది. ముఖ్యంగా రాష్ట్రంలో డీఎంకేకు ప్రత్యామ్నాయం కోరుకుంటున్న వారంతా విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తమిళ రాజకీయాలలో దళపతి విజయ్ ఎంట్రీ అందుకే సంచలనంగా మారింది. సరైన సమయంలో విజయ్ రాజకీయ ప్రవేశం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి దళపతి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.