posted on Aug 22, 2024 2:57PM
వైసీపీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికలలో అవమానకర ఓటమి తరువాత ఏదో మేరకు వైసీపీలో ఆనందం నింపే వార్త ఇది. అయితే ఆ ఆనందం వైసీపీ అధినేతకు మిగిలేటట్లు కనిపించడం లేదు. ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు జగన్ పై తిరుగుబావుటా ఎగురవేయడానికి రెడీ అయిపోయారు. జగన్ పిలుపునకు కూడా వారు స్పందించడం లేదంటున్నారు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స కూడా ఎమ్మెల్యేల తిరుగుబాటుపై అడిగిన ప్రశ్నకు ఔననీ అనకుండా, కాదనీ ఖండించకుండా సమాధానం ఇచ్చారు. రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు. ఏం జరుగుతుందో ముందే చెప్పేయడానికి తానేమీ జ్యోతిష్కుడిని బదులివ్వడం ద్వారా ఎమ్మెల్యేల తిరుగుబాటు వార్తలు అవాస్తవాలు కాదని చెప్పకనే చెప్పేశారు. ఆ ఏడుగురూ ఎవరన్నది వెంటనే తెలియరాలేదు. అయితే పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్న ఫస్ట్రేషన్, జగన్ తాడేపల్లిలో పార్టీ నేతలు, శ్రేణులకు అందుబాటులో ఉండకుండా తరచూ బెంగళూరు చెక్కేస్తుండటంతో అసంతృప్తికి లోనైన ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్ ఇచ్చేందుకే రెడీ అయ్యారని అంటున్నారు.
పార్టీకి రాజీనామా చేసే కంటే జగన్ పై తిరుగుబావుటా ఎగురవేసి అసెంబ్లీకి హాజరు కావాలని వారు భావిస్తున్నారు. వేరే పార్టీలోకి వెళ్లే కంటే జగన్ ను ధిక్కరించి అసెంబ్లీకి వెళ్లడమే మేలని వారు బావిస్తున్నారు. అయితే జగన్ పార్టీని, పార్టీ భవిష్యత్ ను పట్టించుకోకుండా కేవలం తనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి గైర్హాజరు కావడం, ఎమ్మెల్యేలనూ వెళ్లొదన్ని ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ వారీ నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.