అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో 18 మంది మరణించారు. పోయినవారిని ఎలాగూ తిరిగి తీసుకురాలేని పరిస్థితి. అయితే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతుల కుటుంబాలకు కోటి వరకు పరిహారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, 2 లక్షల రూపాయల పరిహారాన్ని మోడీ ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం తరుఫున విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఈ ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వరకు పరిహారం అందే అవకాశం వుందని ఆయన తెలిపారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని, బాధితులకు అండగా వుంటుందని కలెక్టర్ తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి గురువారం నాడు విశాఖ వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి వారి వారి గాయాలను బట్టి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయ్యింది. శిథిలాల తొలగింపును రెస్క్యూ టీమ్ పూర్తి చేసింది. 33 మందిని జెయింట్ ఫైరింజిన్‌తో సిబ్బంది కాపాడింది. 18 మంది మృతులలో 17 మంది కంపెనీ సిబ్బంది. మరో వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో అతిపెద్ద ప్రమాద ఘటన ఇదే. అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.