posted on Jun 11, 2024 10:02AM
తెలంగాణలోనూ తెలుగుదేశంలోకి చేరికలు పెరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం.. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో పోటీకి సై అనడంతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులలో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి త్వరలో తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు గట్టిగా వినిపిస్తోంది.
ఆయన తన ముఖ్య అనుచరులు సన్నిహితులతో గత రెండు రోజులుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ భేటీలలో ఆయన తెరాసను వీడి తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
2014 వరకు మల్లారెడ్డి తెలుగుదేశంలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో క్రియాశీలంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి రావడంతో మల్లారెడ్డి మళ్లీ సొంత గూటికి చేరాలన్న యోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.