జనసేనకు ప్రాధాన్యత
ఎన్నికల్లో పోటీ సమయంలో సీట్లు సర్దుబాటు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక అడుగువెనక్కి తగ్గారు. కూటమి జట్టు కట్టడంలో సీట్ల సర్దుబాటులో సమస్యలు రాకుండా పవన్ కల్యాణ్ వ్యవహరించారు. దీంతో మంత్రి పదవుల కేటాయింపులో జనసేనకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. పవన్ త్యాగానికి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేనకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరగుతోంది. జనసేనకు 5 మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్‌తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరికి కేబినెట్ లో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. అలాగే బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో జనసేన విజయం సాధించింది. 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ జనసేనలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ జనసేనకు 4 మంత్రి పదవులు దక్కితే కాపు సామాజిక వర్గానికి 2, బీసీ 1, ఎస్సీ 1 కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. అయితే ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో మంగళవారం రాత్రికి స్పష్టత రానుంది. మంత్రి పదవులు దక్కిన వారు బుధవారం చంద్రబాబుతో సహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.