posted on Jun 10, 2024 3:58PM
తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం నాడు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి ఏ శాఖలు కేటాయిస్తారా అనే సస్పెన్స్ నెలకొని వుంది. ఈ సస్పెన్స్.ని కొంచెం సడలిస్తూ కొన్ని వార్తలు వస్తున్నాయి. రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రిగా రైల్వే శాఖ, పెమ్మసానికి వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో రైల్వే శాఖ అత్యంత కీలకమైన శాఖ.. అలాగే ఒత్తిడి ఎక్కువగా వుండే శాఖ కూడా. ప్రస్తుతం సంస్కరణల మార్గంలో ప్రయాణిస్తున్న రైల్వే శాఖకు భవిష్యత్తును కొత్తగా దర్శించగల నాయకుడి అవసరం వుంది. ఆ నాయకత్వ బాధ్యతను రామ్మోహన్ నాయుడు సమర్థంగా నెరవేరుస్తారనే దానిలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ నమ్మకంతోనే ప్రధాని మోడీ రామ్మోహన్‌కి ఈ బాధ్యత అప్పగించనున్నారని తెలుస్తోంది. సాధారణంగా రైల్వే శాఖ అనగానే బీహార్ వాళ్ళో, బెంగాల్ వాళ్ళో సొంతం చేసుకుంటూ వుంటారు. దక్షిణాది మంత్రికి రైల్వే శాఖ లభించడం ఇది తొలిసారి అవుతుంది. రామ్మోహన్ నాయుడు రైల్వే శాఖ అందితే, విశాఖ రైల్వే జోన్ డిమాండ్ కూడా ఒక కొలిక్కి వస్తుందన్న అభిప్రాయాలు వున్నాయి. ఇక పెమ్మసానికి వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పదవి లభించడం అనేది సరైన వ్యక్తికి సరైన పదవి అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.