posted on Jun 10, 2024 12:05PM
‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.. వింత నాటకం..’ అని ఒక సినిమా కవి పాట పాడినట్టు… వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య వున్న ఆత్మీయత, అనుబంధాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ‘చిన్న పిల్లోడు.. అమాయకుడు’ అని సర్టిఫికెట్ ఇచ్చి, బాబాయ్ మర్డర్ కేసు నుంచి అవినాష్ రెడ్డిని జగన్ తప్పిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి జగనన్నకు జలక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మంచి ముహూర్తం చూసుకుని బీజేపీలోకి జంప్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని అంటూ వుంటారు.. శాశ్వత బంధువులు కూడా వుండరని అవినాష్‌రెడ్డి మరోసారి ప్రూవ్ చేయబోతున్నారు. తన ఎంపీ సీటు కోసం సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గొడ్డలితో ముద్దాడి పైకి పంపించాడనే ఆరోపణలు అవినాష్ రెడ్డి మీద వున్నాయి. అలాంటిది తన స్వార్థం కోసం జగన్నన్నకు జలక్ ఇవ్వకుండా ఎలా వుంటారు? అవినాష్ రెడ్డి కోసం జగన్ ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలకు దూరమయ్యారు.. కుటుంబానికి దూరమయ్యారు.. ఎన్నో నిందలు భరించారు.. కానీ, నీ త్యాగం నీదే.. నా దారి నాదే అంటూ జగనన్నకి అవినాష్ రెడ్డి నమ్మక ద్రోహం రుచి చూపించబోతున్నారు. తమ్ముడూ తమ్ముడూ అని పాకులాడిన జగన్‌కి తన కుమ్ముడు ఏ రేంజ్లో వుంటుందో అవినాష్ అనుభవంలోకి తీసుకురాబోతున్నారు.
లెక్కప్రకారం ఈసారి ఎన్నికలలో కడప ఎంపీ నియోజకవర్గం నుంచి అవినాష్‌రెడ్డి ఖాయంగా ఓడిపోవాల్సినవాడే. షర్మిల పుణ్యామా అని ఓట్లు చీలిపోయి టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు. షర్మిలే కనుక పోటీ చేయకుంటే అవినాష్ రెడ్డి ఈసారి ఎంపీగా గెలిచేవాడు కాదు. అయినప్పటికీ, అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళకుండా ఎంపీ సీటు కాపాడలేదు. ఎందుకంటే, ఇంతకాలం అవినాష్‌రెడ్డిని కాపాడుకుంటూ వచ్చిన జగనన్న రెక్కలు తెగిన పక్షిలా పక్కన పడి వున్నాడు. ఇక జగన్‌ని నమ్ముకుంటే, తన పని శ్రీకృష్ణ జన్మస్థానమే అని అర్థం చేసుకున్న అవినాష్, తనను తాను కాపాడుకునే ఆత్మరక్షణ మార్గాలను వెతుక్కోవడం ప్రారంభించారు. అందులో చాలా ముఖ్యమైనది బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.
ఈసారి ఎన్నికలలో వైసీపీ మొత్తం నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచింది. రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి నుంచి డాక్టర్ మద్దిల గురుమూర్తి, అరకు నుంచి డాక్టర్ గుమ్మా తనూజారాణి వైసీపీ అభ్యర్థులుగా గెలిచారు. నిన్నటి వరకు జగనన్నకి జై కొట్టిన ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని తనతోపాటు తిరుపతి, అరకు ఎంపీలను కూడా బీజేపీలోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా వున్నారు. ఇక అవినాష్ రెడ్డి స్వయానా జగన్‌కి తమ్ముడు కాబట్టి, రాముడి వెంట లక్ష్మణుడిలా వుంటారని అవినాష్ రెడ్డి జోలికి రాలేదు. అయితే, నేను కూడా మీవెంటే బీజేపీలోకి వస్తానని అవినాష్ రెడ్డే స్వయంగా మిథున్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారని, ఈ విషయాన్ని మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో, అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.
జాతీయ స్థాయిలో తన పార్టీని మోయడానికి ‘ఆ నలుగురు’ ఎంపీలైనా వున్నారని ఊరట చెందుతున్న జగన్మోహన్రెడ్డి వెంట ఇప్పుడు ‘ఆ నలుగురు’ కూడా వుండరని అర్థమైపోయింది. ఇప్పటికే మిగతా ముగ్గురూ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఫోన్ వెళ్తే లిఫ్ట్ చేయడం లేదన్నట్టు తెలుస్తోంది. ఇక తమ్ముడు అవినాష్ మాత్రం.. ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు జగనన్నా అని క్లియర్‌గా చెప్పినట్టు సమాచారం. కాకపోతే, అవినాష్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని, అతనికి వివేకా మర్డర్ కేసు నుంచి రక్షణ కల్పించడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.