posted on Jun 10, 2024 5:40PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 స్థానాలలోనే వైసీపీ విజయం సాధించింది. అలాగే పాతిక లోక్ సభ స్థానాలకు గాను కేవలం నాలుగంటే నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు వైసీపీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలూ పార్టీ నుంచి దూకేయడానికి దారులు వెతుక్కుంటున్నారు.
అధికారంలో ఉండగా తాము చేసిన తప్పిదాలు, అక్రమాలకు ఫలితం అనుభవించాల్సి ఉంటుందన్న భయంతో వణికి పోతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీని శరణు జొచ్చాలన్న భావనలో ఉన్నారు. ఇప్పటికే కడప లోక్ సభ స్ధానం నుంచి విజయం సాధించిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి అటువంటి పప్పులుడకవని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ నుంచి గెలుపొందిన కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలూ బీజేపీలోకి మారిపోదామని ప్రయత్నాలు చేస్తున్నారనీ, ప్రణాళికలు రచ్చిస్తున్నారనీ అయితే ఆ పప్పేలేమీ ఉడకవనీ, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలోకి తీసుకోబోమనీ కుండబద్దలు కొట్టేశారు. బీజేపీ అగ్రనాయకత్వం ఇందుకు అంగీకరించే ప్రశక్తే లేదని అన్నారు. ఎందుకంటే అటువంటి నేతలను పార్టీలో చేర్చుకోవడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పింస్తుందనీ, అది బీజేపీకి నష్టం అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా తెలుగుదేశం ఎంపీల మద్దతుపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు.
ఆదినారాయణరెడ్డి సోమవారం అమరావతిలో పర్యటించి, అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఘోర పరాజయానికి అమరావతి రైతుల చారిత్రాత్మక పోరాటం ఒక ప్రధాన కారణమని చెప్పారు. అమరావతి రైతులు జగన్ కు సరైన గుణపాఠం చెప్పారన్నారు. అతి త్వరలో జగన్ పార్టీ కనుమరుగైపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.