posted on Jun 9, 2024 12:17PM
అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిలిం సిటీలోని విశాలమైన ప్రాంతంలో, రామోజీరావు స్వయంగా నిర్మాణం చేయించుకున్న స్మృతి కట్టడం వద్దే అంత్యక్రియలు పూర్తిచేశారు. రామోజీరావు చితికి ఆయన కుమారుడు, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ నిప్పు అంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల ‘జోహార్’ నినాదాల మధ్య రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.
అంత్యక్రియల్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతోపాటు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ఝజజ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణంరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, రామోజీరావుకు నివాళులు అర్పించారు.