Rajanna Sircilla Crime : వెనుకటికి ఒకరు అత్త మీద కోపాన బిడ్డను కుంపట్లో వేసిందట? అచ్చం అలానే ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘటన. భార్య భర్తలు గొడవపడి ఇంటికి నిప్పు పెట్టడంతో ఇల్లు కాలి బూడిద అయింది. వృద్ధ దంపతులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ లో ముడారి బాలపోశయ్య రాజేశ్వరీ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. మత్స్యకారుడైన బాల పోచయ్య చేపలు పట్టగా ఇంటివద్ద రాజేశ్వరీ చేపలను ఫ్రై చేసి అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. మృగశిరకార్తె కావడంతో చేపలకు భలే గిరాకీ ఉండగా భర్త పోచయ్య ఉదయం బయటకు వెళ్లి మద్యం సేవించి సాయంత్రం ఇంటి కొచ్చాడు. ఈ క్రమంలో చేపలు పట్టేందుకు వెళ్లకుండా మద్యం తాగివస్తావా అని భార్య మందలించింది. దీంతో భార్యభర్తల మద్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన బాలపోశయ్య మద్యం మత్తులో ఇంటిలో కిరోసిన్ చల్లి నిప్పంటించాడు. గమనించిన భార్య రాజేశ్వరీ ప్రాణభయంతో బయటకు పరుగెత్తింది. మంటలకు తాలలేక బాలపోశయ్య కూడా బయటకు పరుగులు తీశాడు. స్థానికుల వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే లోగా ఇల్లు దగ్దం కావడంతోపాటు పక్కింటికి మంటలు అంటుకున్నాయి. బయట నిలిపిన ద్విచక్రవాహనానికి మంటలు వ్యాపించడంతో కాలిపోయింది. మంటల వేడికి పెంకుటిల్లు కాలి, కూలిపోయింది.