posted on Jun 8, 2024 10:58AM
జగన్ ఓటమి మహా గొప్పగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసిన అందరూ కూడా ఇలాంటి ఓటమి నభూతో నభవిష్యత్ అంటున్నారు. గత ఎన్నికలలో 151 స్థానాలు గెలిచిన వైసీపీ.. ఈ సారి ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పడిపోయింది. ఇంత కంటే ఘనమైన పతనం ఇప్పటి వరకూ ఎవరూ ఎక్కడా కనలేదు, వినలేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
జగన్ సహా వైసీపీలో ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు, ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ ఓటమికి చంద్రబాబు కుట్ర చేశారని అంటున్నారు. చంద్రబాబు మాయలో పడి సొంత చెల్లి తల్లీ కూడా తనకు దూరమైపోయారనీ, క్రమం తప్పకుండా తాను బటన్ నొక్కి అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు బోలెడంత సొమ్ములు పందేరం చేశానననీ వారంతా కూడా తనను అన్యాయం చేశారని జగన్ అయితే ఏడ్చినంత పని చేశారు. అసలు వాళ్ల ఓట్లన్నీ తనకు కాకుండా పోవడం వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు జగన్. అయితే తాజాగా ఆ కుట్ర ఏమిటో జగన్ కు స్వయానా మేనమామ అయిన రవీంద్రారెడ్డి తాను ఛేదించేశానంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇంతకూ ఆయన చెప్పినదేమిటంటే.. పోలింగ్ పూర్తయిన తరువాత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా పర్యటన అంటూ సాకు చెప్పి వెళ్లింది సింగపూర్ కు అని రవీంద్రారెడ్డి కనిపెట్టేశారు. చంద్రబాబు సింగపూర్ వెళ్లి టెక్నాలజీ సహాయంతో అక్కడ నుంచి సీల్ వేసి ఉన్న ఈవీఎంలను ట్యాంపర్ చేసి వైసీపీకి పడిన ఓట్లన్నిటినీ తెలుగుదేశం ఖాతాలో వేసేసుకున్నారట. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణ కనీసం ఆయన అయినా నమ్ముతున్నారో లేదో తెలియదు. అయితే రవీంద్రానాథ్ ఆరోపణలను నెటిజెన్ లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
అంతకు ముందు అవ్వా తాతల ఓట్లేమయ్యాయో తెలియడం లేదంటూ మీడియా ముందు దాదాపు ఏడ్చినంత పని చేసిన జగన్ కూడా దీని వెనుక కుట్ర ఉంది, కానీ నిరూపించడానికి ఆధారాలు మాత్రం లేవు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన అనుమానమంతా ఈవీఎంలపైనే అని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. వాస్తవానికి ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయడం, సందేహాలున్నాయనడానికి జగన్ కు కానీ, ఆయన పార్టీ వారికి కానీ ఇసుమంతైనా అర్హత లేదు. ఎందుకంటే గత ఎన్నికలలో ఘన విజయం తరువాత ఈవీఎంలు ఎంత పర్ఫెక్ట్ గా పని చేస్తాయో జగన్ చాలా వివరంగా చెప్పారు. అప్పట్లో ఈవీఎంలపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఎద్దేవా చేశారు. ఈవీఎం బటన్ నొక్కినప్పుడు తాము ఏ పార్టీకి ఓటు వేశామో ఓచర్లలో కనిపిస్తుందని ఇక ఈవీఎం మ్యానిప్యులేట్ ఎలా జరుగుతుందని ఆయన అప్పట్లో ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.
నాడు గొప్పగా పొగిడిన ఈవీఎంలనే నేడు తాను ఓడిపోయే సరికి ట్యాంపర్ అయ్యాయంటూ ఆరోపించడాన్ని నెటిజనులు ఆక్షేపిస్తున్నారు. సింగపూర్ నుంచి సంకేతికతను ఉపయోగించి చంద్రబాబు ట్యాంపర్ చేశారని ఏదో సైన్స్ ఫిక్షన్ కథ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇలంటి ఆరోపణలు, విమర్శలు వైసీపీనీ, ఆ పార్టీ నేతలనూ సర్కస్ లో బఫూన్ల స్థాయికి దిగజార్చడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడవు.