posted on Jun 8, 2024 11:22AM
మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికా కనెటికట్ రాష్ట్రంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, తెలుగు ప్రవాసులు స్థానికంగానే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు అయిన డాక్టర్ రమణా యశస్వి తెలిపారు.
పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంకట రమణ, ఫైజర్ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు. శ్రీరంగం వెంకట రమణకి భార్య మాధవి, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె కవిత ఉన్నారు. ఆయన భార్యది పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గణపవరం గ్రామం. వెంకట రమణ మృతిపట్ల సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. మహాకవి శ్రీశ్రీ భార్య సరోజా శ్రీశ్రీ 80 సంవత్సరాల వయస్సులో కుమారుడిని కోల్పోయారని, ఆమెకు, వెంకటరమణ కుటుంబ సభ్యులకు సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు.