Home తెలంగాణ ప్రత్యేక హోదా.. ఆసక్తీ లేదు.. అవగాహనా లేదు! | people have no intrest and...

ప్రత్యేక హోదా.. ఆసక్తీ లేదు.. అవగాహనా లేదు! | people have no intrest and understanding on special status| election| ajenda| progress| welfare| cbn

0

posted on Jun 8, 2024 2:48PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచీ గట్టిగా సర్క్యులేట్ అవుతూ వస్తున్న మాట ఏపీకి ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అంశం కారణంగానే గతంలో ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చేసింది. ఈ ప్రత్యేక హోదా అంశమే చంద్రబాబు, మోడీల మధ్య అప్పట్లో అగాధం సృష్టించింది. ఈ ప్రత్యేక హోదా అంశమే.. 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడానికి ఒక కారణం అయ్యింది. అప్పట్లో జగన్ పాతిక ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఊరూ వాడా ఏకం అయ్యేలా ప్రచారం చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చాకా ఆ మాటే ఎత్త లేదు అది వేరే సంగతి. 

జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలోనూ ఎన్నడూ ప్రత్యేక హోదా మాటే ఎత్తలేదు. దీంతో అది గతించిన సంగతి అన్నట్లుగా మారిపోయింది. మళ్లీ ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆ నినాదాన్ని ఎత్తుకుంది. అయితే ఆ పార్టీ ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా అధికారంలోకి రాలేదు. ఆ సంగతి అలా ఉంచితే ప్రత్యేక హోదా హామీతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ కు జనం రిక్త ‘హస్త’మే చూపారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కాదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి దార్శనిక నాయకత్వం కావాలనే కోరుకున్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తికి అంగీకరించిన చంద్రబాబును తమ నేతగా జనం గుర్తించారు. అంగీకరించారు.  తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ కానీ, చంద్రబాబు కానీ ఎక్కడా ప్రత్యేక హోదా విషయం ప్రస్తావించలేదు. కాంగ్రెస్ ప్రస్తావించినా జనం వినలేదు.  

ఇక ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారారు. దీంతో కాంగ్రెస్ ఆయనను ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టే దమ్ముందా అని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ సవాల్ కు చంద్రబాబు స్పందించాల్సిన అవసరమే లేదన్నది పరిశీలకుల విశ్లేషణ.  

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కానుంది. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో రాజధాని, పోలవరం వంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేసిందనే భావించాలి. ప్రజలు కూడా చంద్రబాబు దార్శనికతను, అభివృద్ధి కాముకతను, ఆయన సంక్షేమ విధానాలను విశ్వసించారు. ప్రత్యేక హోదా అన్న అంశం జనం మదిలో అసలు లేనే లేదని తాజా ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా రుజువు చేసేశాయి.  సో ప్రత్యేక హోదా విషయంలో కొందరు, కొన్ని పార్టీలూ ఎంత గొంతు చించుకున్నా ప్రజల నుంచి స్పందన రాదు. కంఠశోష వినా అలా అరిచే వారికి మిగిలేది, ఒరిగేదీ ఏమీ ఉండదు. అసలు ప్రజలలో ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే లబ్ధిపై అవగాహనా లేదు. ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టాలన్న ఆసక్తీ లేదు. 

Exit mobile version