Top 10 IMDb rating movies: ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్)లో వచ్చిన రేటింగ్ ను చాలా మంది సినిమా ప్రేక్షకులు ప్రామాణికంగా తీసుకుంటారు. ఆడియెన్సే ఇచ్చే రేటింగ్ కావడంతో వాటిలో బెస్ట్ రేటింగ్ ఉన్న సినిమాలు బాగుంటాయన్నది వాళ్ల ఫీలింగ్. మరి అలా ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ సాధించిన టాప్ 10 సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. అలాగే అవి ఏ ఓటీటీలో ఉన్నాయో కూడా చూడండి.
టాప్ 10 బెస్ట్ ఐఎండీబీ రేటింగ్ మూవీస్
ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ సాధించిన టాప్ 10 సినిమాలన్నీ హాలీవుడ్ నుంచి వచ్చినవే కావడం విశేషం. ప్రపంచ సినిమాలో వీటిని ది బెస్ట్ గా చెబుతుంటారు. మరి మీరు వీటిలో ఎన్ని చూశారు? ఒకవేళ చూడకపోతే ఇప్పుడు ఏ ఓటీటీల్లో చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
ది షాషాంక్ రిడెంప్షన్ (The Shawshank Redemption) – ప్రైమ్ వీడియో
ది షాషాంక్ రిడెంప్షన్ అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ సాధించిన సినిమా. ఈ సినిమాకు 9.3 రేటింగ్ రావడం విశేషం. స్టీఫెన్ కింగ్ రాసిన రీటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడెంప్షన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తన భార్య, లవర్ హత్యల నేరంలో రెండు దశాబ్దాల పాటు జైలు జీవితం గడిపే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ది గాడ్ ఫాదర్ – నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో
ఓ మాఫియా డాన్ చుట్టూ తిరిగే కథే ఈ ది గాడ్ ఫాదర్. ప్రపంచ సినిమా దశ దిశను మార్చిన మూవీగా చెబుతారు. మన రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మూవీ నుంచి స్ఫూర్తి పొందే సర్కార్ లాంటి సినిమాలు తీశాడు. ఈ మూవీకి 9.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోల్లో చూడొచ్చు.
ది డార్క్ నైట్ (The Dark Knight) – జియో సినిమా
2008లో వచ్చిన మూవీ ది డార్క్ నైట్. ఇందులో బ్యాట్‌మ్యాన్, జోకర్ మధ్య నడిచే వార్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 9 ఐఎండీబీ రేటింగ్ ఉన్న ఈ సినిమాను జియో సినిమాతోపాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోల్లో చూడొచ్చు.
12 యాంగ్రీ మెన్ – ప్రైమ్ వీడియో
1957లో వచ్చిన సినిమా ఇది. 12 యాంగ్రీ మెన్ పేరుతోనే వచ్చిన నాటకం ఆధారంగా తెరకెక్కించారు. హత్య కేసులో 12 మంది సభ్యుల జ్యూరీ ముందు ఓ 18 ఏళ్ల కుర్రాడు హాజరవుతాడు. అందులో 11 మంది అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా.. ఒక్క సభ్యుడు మాత్రం అతడు నిరపరాధి అని నమ్మి మిగతా సభ్యులను కూడా అదే నిజం అని నిరూపిస్తాడు. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ది గాడ్ ఫాదర్ 2 – ప్రైమ్ వీడియో
1974లో వచ్చిన ది గాడ్ ఫాదర్ 2 మూవీ ది గాడ్ ఫాదర్ కు సీక్వెల్. ఈ సినిమాకు 9 రేటింగ్ ఉంది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.