Thursday, February 6, 2025

Malayalam Movies Box office: నాలుగు నెలల్లోనే రూ.1000 కోట్లు.. మలయాళం సినిమా బ్లాక్‌బస్టర్

Malayalam Movies Box office: ఇండియన్ సినిమాలో మలయాళం సినిమాలంటే కాన్సెప్ట్ నే నమ్ముకొని, తక్కువ బడ్జెట్, దానికి తగిన వసూళ్లే సాధించే ఇండస్ట్రీగా పేరుంది. బాలీవుడ్, టాలీవుడ్ లాగా కమర్షియల్ హిట్స్, వందల కోట్ల వసూళ్లు అనే వార్తలు అసలు వినిపించేవే కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

ఈ ఏడాది అదే బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు కిందామీదా పడుతుండగా.. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్‌బస్టర్, సూపర్ హిట్ సినిమాలు మాత్రం నాలుగు నెలల్లోనే రూ.1000 కోట్లకుపైగా వసూలు చేశాయి.

మలయాళం బొమ్మ బ్లాక్‌బస్టర్

మలయాళం సినిమాలకు కొన్నేళ్లుగా క్రేజ్ పెరుగుతూనే ఉంది. అయితే అది ఓటీటీలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఈ ఏడాది మాత్రం ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ వసూళ్లతో కమర్షియల్ హిట్స్ గా నిలుస్తున్నాయి. జనవరి నుంచి మే నెలలో సగం రోజులు ముగిసే సమయానికి ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల వసూళ్లు రూ.1000 కోట్లు దాటడం విశేషం.

ఈ వసూళ్లలో 55 శాతం కేవలం మూడు సినిమాల నుంచే వచ్చాయి. మాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మంజుమ్మెల్ బాయ్స్ రూ.240 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) రూ.157 కోట్లు, ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం రూ.153.52 కోట్లు వసూలు చేశాయి. ఈ మూడు కాకుండా ప్రేమలు మూవీ రూ.130 కోట్లకుపైనే వసూలు చేసింది.

ఇవే కాకుండా భ్రమయుగం, అన్వేషిప్పిన్ కండెతుమ్, అబ్రహం ఓజ్లర్ లాంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి రిపోర్టు ప్రకారం.. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మలయాళం సినిమాలన్నీ కలిపి రూ.985 కోట్లు వసూలు చేశాయి. మే తొలి 15 రోజులు కలిపితే ఈ మొత్తం రూ.1000 కోట్లు దాటేసింది.

20 శాతం మలయాళం ఇండస్ట్రీదే..

దేశంలోని సినిమాల బాక్సాఫీస్ వసూళ్లలో మెజార్టీ వాటా బాలీవుడ్ నుంచి ఉండేది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలు నిలిచేవి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. 2024లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లలో 20 శాతం కేవలం మలయాళం ఇండస్ట్రీ నుంచే కావడం విశేషం. ఈ ఏడాది కూడా బాలీవుడ్ టాప్ లో ఉన్నా.. అది కేవలం 38 శాతానికే పరిమితమైంది.

కేవలం ఇండియాలో వసూళ్లను చూసుకున్నా.. మలయాళం సినిమాలు ఇప్పటి వరకూ రూ.500 కోట్లను దాటేశాయి. అందులో మంజుమ్మెల్ బాయ్స్ రూ.141.99 కోట్లతో టాప్ లో ఉంది. ఆడుజీవితం (రూ.85 కోట్లు), ఆవేశం ( రూ.84 కోట్లు), ప్రేమలు (రూ.75 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

బాలీవుడ్, టాలీవుడ్.. అంతంతమాత్రమే..

గతేడాది బాలీవుడ్ ఏకంగా రెండు రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్ల సినిమాలు అందించింది. షారుక్ నటించిన పఠాన్, జవాన్ ఈ ఘనత సాధించాయి. కానీ ఈ ఏడాది మాత్రం మళ్లీ జోరు తగ్గింది. అత్యధికంగా హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ రూ.358 కోట్లు వసూలు చేసింది. సైతాన్ (రూ.213 కోట్లు), క్రూ (రూ.151 కోట్లు), తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా (రూ.146 కోట్లు), ఆర్టికల్ 370 (రూ.105 కోట్లు) మాత్రమే రూ.100 కోట్లు దాటిన బాలీవుడ్ సినిమాలుగా నిలిచాయి.

ఇక టాలీవుడ్ పరిస్థితి కూడా ఈసారి అంతంతమాత్రంగానే ఉంది. సంక్రాంతికి వచ్చిన హనుమాన్, గుంటూరు కారం మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించాయి. ఈగల్, సైంధవ్, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సమ్మర్ లో అయితే పెద్ద హీరోల సినిమాలే లేవు. దీంతో తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే పరిస్థితి నెలకొంది.

సెకండాఫ్ లో మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కల్కి 2898 ఏడీ, పుష్ప 2, దేవరలాంటి సినిమాలు రానుండటంతో టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడనున్నాయి. ఈ మూడు సినిమాలు రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం. అంతేకాదు రూ.1000 కోట్ల మార్క్ అందుకునే సత్తా కూడా ఈ సినిమాలకు ఉన్నాయి. మరి జూన్ నుంచి డిసెంబర్ వరకు టాలీవుడ్ ఏం చేస్తుందో చూడాలి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana