Laapataa Ladies Movie: తక్కువ బడ్జెట్‍తో స్టార్ నటీనటులు లేకుండా తెరకెక్కిన లాపతా లేడీస్ సినిమా భారీస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ప్రేక్షకులతో పాటు చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ చిత్రం పొగడ్తల వర్షం కురిపించారు. లాపతా లేడీస్ చిత్రానికి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. ఏప్రిల్ 26న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాకు చాలా పాపులారిటీ, ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో మంజూ మాయ్ పాత్ర అందరినీ ఆలోచింపజేసింది.
మంజూ మాయ్ పాత్ర గురించి..
లాపతా లేడీస్ మూవీలో.. కొత్తగా పెళ్లయిన దీపక్ కుమార్ (స్పర్ష్ శ్రీవాత్సవ) నుంచి తప్పిపోయి.. ఓ రైల్వే స్టేషన్‍లో దిగుతుంది పూల్ కుమారి (నితాన్షి గోయల్). దిక్కుతోచని స్థితిలో ఉన్న పూల్‍కు రైల్వే స్టేషన్‍లో స్టాల్ నడుపుకునే మంజూ మాయ్ (ఛాయా కదమ్) ఆశ్రయం ఇస్తారు. మంజూ మాయ్ తన కుటుంబాన్ని కాదని సొంతంగా జీవించే ధైర్యవంతమైన మహిళ. కుటుంబ కట్టుబాట్ల మధ్య వంట తప్ప బయటి ప్రపంచం తెలియకుండా పూల్ కుమారి పెరిగి ఉంటుంది. భర్త ఊరేదో కూడా మరిచిపోతుంది. దీంతో బయటి పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఎలా జీవించాలో పూల్‍కు చెబుతారు మంజూ మాయ్. ఈ క్రమంలో లాపతా లేడీస్ సినిమా కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్‍లు ఉంటాయి. అందరినీ ఆలోచింపజేస్తాయి. సంభాషణలు సింపుల్‍గా ఉన్నా.. వాటి వెనుక అర్థాలు పవర్‌ఫుల్‍గా అనిపిస్తాయి.
మంజూ మాయ్ టాప్ డైలాగ్‍లు ఇవే..
లాపతా లేడీస్‍లో మంజూ మాయ్ పాత్రలో ఛాయా కదమ్ అందరినీ ఆలోచింపజేసేలా డైలాగ్స్ చెప్పారు. ప్రస్తుతం హిందీలో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుండగా.. డైలాగ్‍లను ఇక్కడ తెలుగులో అనువదించాం.
- “నేను పెట్టే తిండి తింటూ నా భర్త, నా కొడుకు మద్యం తాగి నన్ను కొడుతూ ఉండేవారు. ప్రేమించినప్పుడు కొట్టే హక్కు కూడా ఉంటుందని అంటుండేవారు. ఒకరోజు నేనే ఆ హక్కును ఉపయోగించుకున్నా” అని పూల్‍తో చెబుతారు మంజూ మాయ్. అంటే.. తనను వేధించిన భర్త, కుమారుడిని ధైర్యం తెచ్చుకొని తానే తరిమేశానని వివరిస్తారు.
- ఒంటరిగా ఉండేందుకు భయం లేదా అని పూల్ అడిగిన ప్రశ్నకు మంజూ మాయ్ చెప్పే డైలాగ్ భేష్ అనిపిస్తుంది. “ఒంటరిగా ఉంటూ సంతోషంగా ఉండడం చాలా కష్టంగా ఉంటుంది పూల్. అయితే, అలా ఉండడం ఒక్కసారి నేర్చుకున్నామంటే.. మనల్ని ఇక ఎవరూ బాధపెట్టలేరు” అని మంజూ మాయ్ బదులిస్తారు. ఒంటరిగా సంతోషంగా జీవించడం నేర్చుకుంటే ఎవరూ బాధపెట్టలేరని ఆమె పూల్‍తో చెబుతారు.
- “శతాబ్దాల నుంచి ఈ దేశంలోని మహిళలను మోసం చేస్తూనే ఉన్నారు. గౌరవప్రదమైన అమ్మాయి పేరుతో మోసగిస్తున్నారు” అని పూల్‍తో మంజూ మాయ్ అంటారు. గౌరవమైన కట్టుబాట్లు అంటూ బయటి ప్రపంచం తెలియకుండా అమ్మాయిలను పెద్దలు పెంచుతూ శతాబ్దాలుగా మోసం చేస్తున్నారని మంజూ మాయ్ చెబుతారు.
- “మహిళలు వ్యవసాయం చేయగలరు. పిల్లలను కనగలరు.. పెంచగలరు. ఈ విషయాల గురించి ఆలోచిస్తే.. మహిళలకు పురుషులపై ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. కానీ ఒకవేళ మహిళలు దీనిని గుర్తిస్తే.. పురుషులు బెదిరిపోతారు. అవును కదా?” అని పూల్‍తో మంజూ మాయ్ అంటారు.
- “ఏమీ తెలియని వారిలా ఉండడంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. కానీ ఏమీ తెలియని మూర్ఖుల్లా ఉండడాన్ని గౌరవం అని ఫీలవడాన్ని సిగ్గుచేటుగా భావించాలి” అనే మంజూ మాయ్ డైలాగ్ కూడా ఆకట్టుకుంది.
లాపతా లేడీస్ చిత్రంలో మంజూ మాయ్ చెప్పే మరిన్ని డైలాగ్‍లు ఆలోచింపజేస్తాయి. పూల్, మంజూ మాయ్ మధ్య సంభాషణలు అన్నీ సింపుల్‍గా ఉంటూనే మనసును తాకుతాయి. ఆమె మాటలతో పూల్ చాలా మారుతుంది. భర్త దగ్గరికి వెళ్లినా తన సొంతకాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంటుంది.
మంజూ మాయ్ పాత్రలో సీనియర్ నటి ఛాయా కదమ్.. లాపతా లేడీస్ సినిమాలో అద్భుతంగా నటించారు. ఈ మూవీ చూసిన అందరికీ ఆమె పాత్ర ప్రత్యేకంగా గుర్తు ఉంటుంది.
కట్టుబాట్లు, అచారాల పేరుతో మహిళల ఎదుర్కొంటున్న ఆంక్షలు, వివక్ష, ఇబ్బందులను లాపతా లేడీస్ మూవీలో దర్శకురాలు కిరణ్ రావ్ చూపించారు. ఇంత సీరియస్ సబ్జెక్టును ఎంటర్‌టైనింగ్‍గా, హృదయాలను హత్తుకునే విధంగా చూపించడంతో ఈ మూవీ బాగా సక్సెస్ అయింది.
లాపతా లేడీస్ చిత్రంలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంట, రవికిషన్, ఛాయా కదమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతిభ రంట చేసిన పుష్ప రాణి అలియాజ్ జయ పాత్ర కూడా ప్రధానమైనది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ తమ నటనతో ఆకట్టుకున్నారు. రవికిషన్, ఛాయా మినహా మిగిలిన వారు కొత్త నటులే అయినా అందరూ మెప్పించారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.