Sunday, October 27, 2024

IPL 2024 Orange, Purple Cap: ఇక మిగిలింది ప్లేఆఫ్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరు ఉన్నారంటే..

IPL 2024 Orange Cap, Purple Cap: ఐపీఎల్ 2024 సీజన్‍లో లీగ్ దశకు తెరపడింది. ప్లేఆఫ్స్ పోరు జరగనుంది. లీగ్ దశ చివరి రోజు ఆదివారం (మే 19) రెండు మ్యాచ్‍లు జరుగగా.. పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్‍రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. కోల్‍కతా, రాజస్థాన్ మ్యాచ్ రద్దయింది. కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ ప్లేఆఫ్స్‌లో తలపడనున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ లీగ్ దశ ముగిసే సరికి ప్రస్తుతం అత్యధిక పరుగుల ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్ల పర్పుల్ క్యాప్ రేసులో ఎవరు ముందున్నారో ఇక్కడ చూడండి.

ఆరెంజ్ రేసులో కోహ్లీ టాప్

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఒక్కో జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‍లు ఆడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 14 మ్యాచ్‍ల్లో 708 పరుగులతో టాప్‍లో ఉన్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కోహ్లీ వద్దే ఉంది. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 583 పరుగులతో ఉన్నాడు. అయితే, చెన్నై ఎలిమినేట్ కావటంతో రుతురాజ్‍కు ఛాన్స్ లేదు. ఆరెంజ్ క్యాప్ రేసులో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ నుంచి కోహ్లీకి పోటీ ఎదురుకానుంది. హెడ్ 12 మ్యాచ్‍ల్లోనే 533 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ కూడా ప్లేఆఫ్స్ ఆడనుంది.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ 14 మ్యాచ్‍ల్లో 531 పరుగులు సాధించాడు. ప్లేఆఫ్స్‌లో అదరగొడితే ఆరెంజ్ క్యాప్ ఛాన్స్ పరాగ్‍కు కూడా ఉంది. ఈ రేసులో సాయి సుదర్శన్ 12 మ్యాచ్‍ల్లో 527 పరుగులతో ఐదో ప్లేస్‍లో ఉన్నాడు. అయితే, గుజరాత్ లీగ్ దశలోనే ఎలిమినేట్ అయింది.

పర్పుల్ క్యాప్ ఇలా..

పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్ 14 మ్యాచ్‍ల్లో 24 వికెట్లు తీసి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అయితే, పంజాబ్ ప్లేఆఫ్స్ నుంచి ఔట్ అయింది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 13 మ్యాచ్‍ల్లో 20 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై కూడా ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ 14 మ్యాచ్‍ల్లో 19 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కోల్‍కతా నైట్‍రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 12 మ్యాచ్‍ల్లో 18 వికెట్లను పడొగట్టి పర్పుల్ రేసులో నాలుగో ప్లేస్‍లో ఉన్నాడు. లీగ్ దశలోనే ఎలిమినేట్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశ్‍పాడే 13 మ్యాచ్‍ల్లో 17 వికెట్లు తీసి ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే, ఈ ఐదుగురు బౌలర్లలో ప్లేఆఫ్స్ ఆడేది వరుణ్ చక్రవర్తి ఒక్కడే.

పర్పుల్ రేసులో టాప్-5లో కోల్‍కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి క్యాప్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ప్లేఆఫ్స్‌లో మరో ఆరు వికెట్లు తీయగలిగేతే అతడు పర్పుల్ క్యాప్ దక్కించుకోవచ్చు. అయితే, టాప్-5లో లేని బౌలర్ ఎవరైన ప్లేఆఫ్స్‌లో సత్తాచాటితే రేసులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్ మే 21 నుంచి జరగనున్నాయి. మే 21న క్వాలిఫయర్-1లో కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు తలపడనున్నాయి. మే 24న క్వాలిఫయర్-2, మే 26వ తేదీన ఫైనల్ జరగనున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana