Saturday, October 26, 2024

Gopi Thotakura: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రవాసాంధ్రుడు.. భూ కక్ష్య వెలుపలికి విజయవాడ యువకుడి ప్రయాణం

Gopi Thotakura: జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ స్పేస్‌ టూర్‌ ప్రయోగంలో తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా గోపీ తోటకూర చరిత్ర సృష్టించారు. భూ గ్రహం వెలుపలికి ప్రయాణించిన రెండో భారతీయుడిగా, తొలి ఆంధ్రుడిగా రికార్డు సృష్టించారు.

ప్రవాసాంధ్రుడైన తోటకూర గోపీ.. పర్యాటకుడిగా అంతరిక్ష పర్యటన చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. బ్లూ ఆరిజన్‌ న్యూషెఫర్డ్‌ 25(ఎన్‌ 25) మిషన్‌లో గోపి భాగం అయ్యారు. ఇప్పటి వరకు స్పేస్ మిషన్లు పరిశోధనల్లో భాగంగానే జరుగుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా ప్రైవేట్ స్పేస్‌ యాత్రల్లో పర్యాటకుల్ని కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లుతున్నారు. ఇలా అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయుడిగా తోటకూర గోపి రికార్డు సృష్టించారు.

అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 8.5కు పశ్చిమ టెక్సాస్‌లోని బ్లూ ఆరిజన్ కంపెనీ లాంచ్‌ సైట్‌ నుంచి అంతరిక్ష వాహనం నింగిలోకి బయల్దేరింది. నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యం ఇది బయలుదేరింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన తోటకూర గోపి అమెరికాలో పారిశ్రామికవేత్తగా, పైలట్‌గా ఉన్నారు. మరో ఐదుగురితో కలిసి అంతరిక్ష యాత్రను చేపట్టారు. భూ వాతావరణానికి వెలుపలికి వారితో కలిసి ప్రయాణించారు. వీరిలో 90ఏళ్ల ఎడ్‌ డ్వైట్ కూడా ఉన్నారు. మాసన్ ఎంజిల్‌, సిల్వియన్ చిరాన్, కెన్నెత్ ఎల్‌ హెస్‌, కారోల్ షల్లర్ తదితరులు అంతరిక్ష ప్రయాణం చేసిన వారిలో ఉన్నారు.

గోపి ఇప్పటికీ భారతీయ పాస్‌పోర్ట్‌ కలిగి ఉన్నారు.అంతరిక్ష యాత్రను చేసిన తొలి భారతీయుగా చరిత్ర సృష్టించారు. అధికారికంగా అయితే రాకేష్‌ శర్మ తర్వాత అంతరిక్ష యాత్రను చేపట్టిన రెండో భారతీయ అస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందారు.

బ్లూ ఆరిజిన్ అందించిన వివరాల ప్రకారం గోపి ఒక పైలట్‌గా, ఏవియేటర్‌గా ఉన్నారు. అతను డ్రైవింగ్ చేయడానికి ముందు ఎలా ఎగరాలో నేర్చుకున్నాడు.” హార్ట్స్ ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో హోలిస్టిక్ వెల్ నెస్ అండ్ అప్లైడ్ హెల్త్ గ్లోబల్ సెంటర్ ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ ను 30 ఏళ్ల గోపీ స్థాపించారు.

వాణిజ్యపరంగా జెట్ విమానాలను నడపడంతో పాటు బుష్, ఏరోబాటిక్, సీప్లేన్లతో పాటు గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను నడుపుతూ అంతర్జాతీయ మెడికల్ జెట్ పైలట్‌గా గోపి సేవలందించారు. ఇటీవల టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో శిఖరానికి కూడా వెళ్లారు.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన తోటకూర ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

సూయజ్ టి-11 ద్వారా 1984 ఏప్రిల్ 3న అంతరిక్ష యాత్ర చేసిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ గుర్తింపు పొందమారు. సోవిషట్ యూనియన్ ఇంటర్ కాస్మోట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన ఈ యాత్రను చేశారు. భారతీయ మూలాలు ఉన్నా కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌, రాజా చారి, శిరీష బండ్ల వంటి వారు కూడా గతంలో అంతరిక్షంలో ప్రయాణించారు. భారతీయ మూలాలు ఉన్నా వారంతా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. ప్రొఫెషనల్ అస్ట్రోనట్స్‌గా అంతరిక్షంలోకి ప్రయాణించారు.

ఎన్‌ఎస్‌ 25 వాహనం ద్వారా నింగిలోకి వెళ్లిన అంతరిక్ష పర్యాటకులు భూ బాహ్య కక్ష వరకు ఎలాంటి అటంకాలు లేకుండా ప్రయాణించారు. ఆ తర్వాత రాకెట్‌తో పాటు క్యాప్సూల్‌ భూమికి తిరుగు ప్రయాణమైంది. రాకెట్ ల్యాండ్‌ అయిన కాసేపటికి క్యాప్సూల్ కూడా సురక్షితంగా పారాచూట్ల సాయంతో నేలను తాకింది. దీనికి 15నిమిషాల సమయం పట్టింది. జెఫూ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ కంపెనీ రెండేళ్ల క్రితం అంతరిక్ష యాత్రలు చేపట్టింది. క్యాప్సూల్ టచ్ టౌన్‌, వెల్‌కమ్‌ బ్యాక్ ఎన్‌25 అంటూ బ్లూ ఆరిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఎన్ఎస్ -25 మిషన్ కోసం ఆరుగురు సిబ్బందిలో ఒకరిగా తోటకూర ఎంపికయ్యాడు, 1984 లో భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తరువాత అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా, రెండో భారతీయుడిగా గోపి గుర్తింపు పొందారు. అమెరికాలో పారిశ్రామికవేత్తగా, పైలట్‌గా స్థిరపడినా ఆయన ఇప్పటికి భారత పాస్‌పోర్ట్‌నే కొనసాగిస్తున్నారు.

బ్లూ ఆరిజిన్‌ ఏడోసారి చేపట్టిన స్పేస్‌ టూర్‌లో పర్యాటనకులతో కూడిన విమానం ఎన్ఎస్-25 ఆదివారం ఉదయం వెస్ట్ టెక్సాస్లోని లాంచ్ సైట్ వన్ నుంచి బయలుదేరిందని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది.

బ్లూ ఆరిజిన్ తన ఏడవ మానవ సహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసినట్టు ప్రకటించారు.

పర్యాటకుల్లో ఒకరైన 90ఏళ్ల మాజీ వైమానిక దళ కెప్టెన్ ఎడ్ డ్వైట్ 1961 లో అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ చేత అమెరికా మొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైనా ఎగిరే అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదని బ్లూ ఆరిజన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

న్యూ షెపర్డ్ ఇప్పటి సిబ్బందితో సహా 37 మందిని అంతరిక్షంలోకి పంపింది. పర్యాటకులకు అంతరిక్షంలోకి వెళ్లిన వారికి అభినందనలు తెలిపారు. ” వ్యోమగాములుగా ఈ జీవితాన్ని మార్చే అనుభవాన్ని అందించే అవకాశం తమకు ఇచ్చినందుకు పెద్ద ధన్యవాదాలు” అని న్యూ షెపర్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిల్ జాయిస్ అన్నారు.

” ప్రతి ఒక్కరూ భూమి నుంచి అంతరిక్షానికి రహదారిని నిర్మించే క్రమంలో తమ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడే మార్గదర్శకులుగా ” అని షెపర్డ్ స్పేస్‌ టూర్ చేసిన వారిని కొనియాడారు.

భూమి వాతావరణం మరియు బాహ్య అంతరిక్షం మధ్య ప్రతిపాదిత సంప్రదాయ సరిహద్దు అయిన కర్మన్ రేఖపై 31 మంది పర్యాటకుల్ని ఇప్పటి వరకు తీసుకువెళ్లారు. న్యూ షెపర్డ్ అనేది బ్లూ ఆరిజిన్ చే అంతరిక్ష పర్యాటకం కోసం అభివృద్ధి చేసిన ఉప-కక్ష్య ప్రయోగ వాహనం.

స్పేస్ మిషన్ సమయంలో ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో నింగిలోకి దూసుకెళ్లారు. ఈ రాకెట్ క్యాప్సూల్ కర్మాన్ రేఖను దాటి ప్రయాణించింది. ఇది భూమి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. భూగ్రహాన్ని దాటుకుని అంతరిక్షం ప్రారంభమయ్యే ఎత్తుగా దీనిని గుర్తించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana