Home ఆంధ్రప్రదేశ్ AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు...

AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

0

AP Weather Update: ఏపీలో గత వారం పదిరోజులుగా వాతావరణం శాంతించింది. మండే ఎండల నుంచి ప్రజలకు ఉపశనమం దొరికింది. మే మొదటి వారం వరకు అత్యధికంగా 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది తొలుత ఈశాన్యంగా పయనించి 24వ తేదీ నాటికి, మధ్య బంగాళాఖా తంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రకటించారు.

భూ ఉపరితలం నుంచి అల్పపీడనం/ వాయుగుండం వైపు పొడిగాలులు వీస్తాయని, దాని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఈనెల 23 నుంచి ఎండ తీవ్రత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. కోస్తాలో 25వ తేదీ వరకు వేడి వాతావరణం ఉంటుందని అంచనా వేశారు.

మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు, కొమరిన్‌‌లోని పలు ప్రాంతాలను ఆదివారం నైరుతి రుతుపవనాలు తాకాయి.

సాధారణంగా ఏటా మే 22న దక్షిణ అండమాన్‌ సముద్ర పరిసరాలను నైరుతి రుతుపవనాలు తాకుతాయి. ఈ ఏడాది మూడ్రోజుల ముందే రుతుపవనాలు వచ్చేశాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతం వైపు పడమర, నైరుతి గాలులు బలంగా వీయడం, భారీగా తేమ మేఘాలు ఆవరించడంతో పాటు శనివారం నుంచి నికోబార్‌ దీవుల్లో భారీగా వర్షాలు కురవడంతో నైరుతి రుతు పవనాలు వచ్చేశాయని ఐఎండీ నిర్ధారించింది.

మరోవైపు ఈనెల 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది.అది ఈశాన్యంగా పయనించి 24వ తేదీ కల్లా మధ్య బంగాళాఖాతంలో వాయు గుండంగా బలపడుతుందని ఐఎండీ వివరించింది. 24వ తేదీ తర్వాత మరింత బలపడి తుఫాన్‌గా మారి ఒడిశా తీరం దిశగా రావొచ్చని ఇస్రో అంచనా వేస్తోంది. వాయుగుండం కదలికలపై 22వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని ప్రకటించారు.

తమిళనాడు పరిసరాల్లో నెలకొని ఉన్న ఉపరితల ఆవర్తనం, మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈనెల 23వ తేదీ వరకు దక్షిణ భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కర్ణాటక కోస్తా ప్రాంతంలో ఈనెల 20, 21 22 తేదీలు, దక్షిణ కర్ణాటకలో 21, 22 తేదీలు, లక్షద్వీ్‌పలో 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 20, 21, 22 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్‌, కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ,

తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌, దక్షిణకర్ణాటక, ఏపీ, తెలంగాణ, యానాం, సబ్‌-హిమాలయన్‌ పశ్చిమబెంగాల్‌, సిక్కింలలో వచ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, పిడుగులు, బలమైన గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది.

బుధవారం నుంచి అల్పపీడనం….

ఐఎండి సూచనల ప్రకారం దక్షిణ అంతర్గత తమిళనాడు & పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని, మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందన్నారు

దీని ప్రభావంతో సోమవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు. మరోవైపు రేపు శ్రీకాకుళం 6, విజయనగరం 8, మన్యం 9, అల్లూరి జిల్లా చింతూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి పల్నాడు జిల్లా పెద్దకూరపాడు 55.5మిమీ, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి 40మిమీ, జగ్గయ్యపేట 39.5మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగల 38మిమీ, చింతపల్లి 36మిమీ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి 35.2మిమీ,అనకాపల్లి రావికమతం 35.2మిమీ అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 35మిమీ,తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 31.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.

Exit mobile version