RR vs KKR IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్లో లీగ్ దశ ముగిసింది. ఇక ప్లేఆఫ్స్ పోరు ఉండనుంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు (మే 19) గౌహతి వేదికగా జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా ఈ పోరు జరగలేదు. టాస్ పడినా ఆట సాధ్యం కాలేదు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు నిరాశ ఎదువగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసి వచ్చింది. రెండో ప్లేస్‌ను ఎస్ఆర్హెచ్ కైవసం చేసుకుంది. ఆ వివరాలివే..
టాస్ పడినా..
రాజస్థాన్, కోల్‌కతా మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆరంభం నుంచి ఆటంకం కలిగించింది. చాలాసేపు ఎడతెరిపి లేని వాన పడింది. అయితే, చాలాసేపటి తర్వాత వాన ఆగడంతో అంపైర్లు 7 ఓవర్ల మ్యాచ్ జరపాలని నిర్ణయించారు. ఇందుకు గాను టాస్ కూడా పడింది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. అయితే, అంతలోనే మళ్లీ వర్షం పడింది. దీంతో ఇక మ్యాచ్‌ను అంపైర్లు రద్దుచేసేశారు.
రాజస్థాన్‌కు నిరాశ.. హైదరాబాద్‌కు లక్
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాప్ ప్లేస్ ఖరారు చేసుకుంది. అయితే, రెండో ప్లేస్ కోసం రాజస్థాన్ రాయల్స్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఒకవేళ కోల్‌కతాతో ఈ మ్యాచ్ గెలిచి ఉంటే రాజస్థాన్‌కు రెండో ప్లేస్ దక్కేది. అయితే, రద్దవటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో ప్లేస్‌ను నిలబెట్టుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచి, 3 ఓడింది కోల్‌కతా. రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. దీంతో కేకేఆర్ 20 పాయింట్లను దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది.
అయితే, రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి, 5 ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో 17 పాయింట్లను పొందింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి, ఐదు ఓడగా.. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో 17 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. అయితే, రాజస్థాన్ 0.273 నెట్రన్ రేట్‌తో ఉంటే హైదరాబాద్ అంతకు మించి 0.414 నెట్ రన్‌రేట్‌తో ఉంది. దీంతో హైదరాబాద్ రెండో ప్లేస్ దక్కించుకుంది. రాజస్థాన్ మూడో ప్లేస్‌లో నిలిచింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది.
ఈ సీజన్ ప్లేఆఫ్స్ మే 21న మొదలుకానున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌లో తలపడనున్నాయి.
టాప్-2లో ఉంటే లాభమిదే..
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2 జట్లకు ప్లేఆఫ్స్‌లో రెండు ఛాన్సులు ఉంటాయి. క్వాలిఫయర్ 1లో గెలిస్తే నేరుగా ఫైనల్స్ చేరవచ్చు. ఆ మ్యాచ్‌లో ఓడినా మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న టీమ్‌లు ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి ఔటే. ఫైనల్ చేరాలంటే మాత్రం రెండు మ్యాచ్‌లు గెలువాల్సి ఉంటుంది.
ఈ సీజన్లో టాప్-2లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 21న క్వాలిఫయర్ 1 ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన టీమ్‌కు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో ఆడొచ్చు. మే 22న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు.. క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్‌తో ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంది. ఇలా.. టాప్-2లో ఉన్న జట్టుకు రెండు అవకాశాలు లభిస్తాయి. కోల్‌కతా, రాజస్థాన్ మధ్య మ్యాచ్ రద్దవటంతో ఈ రెండో ప్లేస్‌ను హైదరాబాద్ దక్కించుకుంది.
ప్లేఆఫ్స్ తేదీలు ఇలా..
ఐపీఎల్ 2024 సీజన్లో మే 21న కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. మే 22న బెంగళూరు, రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ ఉంటుంది. మే 24న క్వాలిఫయర్-2 జరుగుతుంది. మే 26న ఫైనల్ జరగనుంది.
కాగా, నేటి మధ్యాహ్నం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపి లీగ్ దశను విజయంతో ముగించింది. రెండో ప్లేస్‌కు ఎగబాకి.. దాన్నే ఖరారు చేసుకుంది.