Theater Ads Time: కొవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరిగింది. అప్పటివరకు థియేటర్లలో సినిమా చూసేందుకు అలవాటుపడిన ఆడియెన్స్ ఓటీటీల వైపు మళ్లారు. కొవిడ్ సంక్షోభం ముగిసినా థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం పెరగలేదు. మరోవైపు థియేటర్, ఓటీటీ రిలీజ్ డేట్ మధ్య గ్యాప్ తగ్గడం కూడా థియేటర్లకు ఎదురుదెబ్బగా మారింది. ఇప్పుడు స్టార్ హీరోలు సినిమాలు సైతం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. దాంతో థియేటర్ల రెవెన్యూ చాలా పడిపోయింది.
సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. నానాటికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో యాజమాన్యాలు డైలామాలో పడుతోన్నాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు.
35 నిమిషాలు యాడ్స్…
ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్, మల్టీప్లెక్స్‌లలో సినిమా చూసేందుకు వచ్చే వారికి యాడ్స్ పెద్ద సమస్యగా మారాయి. . సాధారణంగా సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్లీప్లెక్స్‌లలో 14 నుంచి 16 నిమిషాల వరకు యాడ్స్ స్క్రీనింగ్ చేస్తుంటారు. కానీ ఐనాక్స్‌లో ఈ టైమ్‌ను డబుల్ చేశారు. సినిమా ఆరంభానికి ముందు, ఇంటర్వెల్‌లో కలిపి 35 నిమిషాల పాటు పీవీఆర్ ఐనాక్స్, మల్టీప్లెక్స్‌లలో యాడ్స్ స్క్రీనింగ్ అవుతుంటాయి. ఈ యాడ్స్ టైమ్ తగ్గించాలంటూ చాలా రోజులుగా ఆడియెన్స్ డిమాండ్ చేస్తున్నారు. యాడ్ రెవెన్యూ తగ్గుతుందనే ఆలోచనతో పీవీఆర్ ఇన్నాళ్లు ఆడియెన్స్ రిక్వెస్ట్‌లను పట్టించుకోలేదు.
యాడ్స్ టైమ్ తగ్గింపు…
కానీ గత కొన్నేళ్లుగా పీవీఆర్ ఐనాక్స్, మల్టీప్లెక్స్‌ల ఫుట్‌పాల్ గణణీయంగా పడిపోయినట్లు తేలింది. ఫుట్‌పాల్ సంఖ్యను పెంచుకునేందుకు 35 నిమిషాల నుంచి పది నిమిషాలకు యాడ్స్ స్క్రీనింగ్ టైమ్‌ను తగ్గించారు. మెట్రోపాలిటన్ సిటీస్‌లోని అన్ని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో కొత్త రూల్‌ను అమలు చేయబోతున్నట్లు తెలిసింది.
యాడ్ ఫ్రీ స్క్రీనింగ్…
యాడ్స్ టైమ్‌ను తగ్గించడం వల్ల థియేటర్ల ఫుట్‌పాల్ పెరగడమే కాకుండా ఎక్స్‌ట్రా షోను కూడా స్క్రీనింగ్ చేసే అవకాశం ఉందనే పీవీఆర్ యాజమాన్యం భావిస్తోన్నట్లు సమాచారం.
ఓటీటీలో మాదిరిగానే ప్రత్యేకంగా యాడ్ ఫ్రీ మూవీ స్క్రీనింగ్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పీవీఆర్ ఐనాక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాడ్స్ లేకుండా సినిమా చూడాలంటే టికెట్ ఛార్జెస్‌తో పాటు అదనంగా ఆడియెన్స్ కొంతం మొత్తం చెల్లించాల్సివుంటుందని అంటున్నారు. యాడ్స్ ఫ్రీ స్క్రీనింగ్‌కు సంబంధించిన ఛార్జెస్‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.