Monday, January 20, 2025

Sunrisers Hyderabad: 8 మ్యాచ్‌లలోనే 100 సిక్స్‌లు.. సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024లో తమ వీర బాదుడుతో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్.. ఆర్సీబీతో మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒక సీజన్లో అత్యధిక సిక్స్ లు బాదిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. అది కూడా కేవలం 8 మ్యాచ్ లలోనే ఈ రికార్డు క్రియేట్ చేయడం గమనార్హం.

8 మ్యాచ్ లలోనే 100 సిక్స్‌లు

సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో 8 మ్యాచ్ లలోనే 100 సిక్స్ లు బాదింది. ఇది మామూలు విషయం కాదు. అంటే సగటున ప్రతి మ్యాచ్ కు 12.5 సిక్స్ లు కొట్టడం విశేషం. ఈ సీజన్లో రెండు మ్యాచ్ లలో సన్ రైజర్స్ బ్యాటర్లు 22 సిక్సర్లు బాదారు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ లో 9 సిక్స్ లు కొట్టడం ద్వారా ఒక సీజన్లో 100 సిక్స్ ల మార్క్ అందుకున్న తొలి జట్టుగా నిలిచింది.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. బౌండరీలతో వీళ్లు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. సిక్సర్ల మోతలో అయితే మరే ఇతర టీమ్..సన్ రైజర్స్ కు దరిదాపుల్లో లేదు. గతంలో 2022 సీజన్లో సన్ రైజర్స్ 97 సిక్స్ లు కొట్టింది. అయితే ఈసారి కేవలం 8 మ్యాచ్ లలోనే ఆ రికార్డు బ్రేక్ చేసి 100 సిక్స్ లు నమోదు చేసింది.

లీగ్ స్టేజ్ లోనే ఆ టీమ్ మరో 6 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే ఈ అరుదైన రికార్డు అందుకున్న మ్యాచ్ లోనే సన్ రైజర్స్ ఓడిపోయింది. వరుసగా ఆరు ఓటములతో సతమతమైన ఆర్సీబీ ఈ మ్యాచ్ లో విజయం ద్వారా మళ్లీ గాడిలో పడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ 206 పరుగులు చేయగా..సన్ రైజర్స్ 171 పరుగులకే పరిమితమయ్యారు.

సన్ రైజర్స్ రికార్డులు హోరు

ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సీజన్లో రెండుసార్లు ఐపీఎల్లో అత్యధిక పరుగులు రికార్డును బ్రేక్ చేసింది. మొదట ముంబై ఇండియన్స్ పై 277 రన్స్ చేయగా.. మూడు వారాల్లోనే ఆర్సీబీపై 287 రన్స్ తో ఆ రికార్డును తిరగరాసింది. ఈ రెండు మ్యాచ్ లలోనూ సన్ రైజర్స్ బ్యాటర్లు ఒక ఇన్నింగ్స్ లో 22 సిక్స్ లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

ఓ టీ20 మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ ల రికార్డు కూడా ఇదే. కేవలం రెండు మ్యాచ్ లలో కలిపి 44 సిక్స్ లు కొట్టగా.. ఇప్పుడు 8వ మ్యాచ్ లోనే 100 సిక్స్ ల మార్క్ అందుకుంది. సన్ రైజర్స్ జోరు చూస్తుంటే.. మిగిలిన ఆరు లీగ్ మ్యాచ్ లలో మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో సొంత మైదానంలో తొలిసారి ఓడిన ఎస్ఆర్‌హెచ్.. మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana