KKR vs PBKS: ఐపీఎల్ 2024లో మరోసారి స్కోరు 250 దాటింది. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లను ఉతికారేసిన ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్.. నైట్ రైడర్స్ కు రికార్డు స్కోరు అందించారు.
ఈడెన్ గార్డెన్స్ చరిత్రలో ఓ టీ20 మ్యాచ్ లో ఇదే అత్యధిక స్కోరు కాగా.. నైట్ రైడర్స్ తన రెండో అత్యధిక స్కోరు సాధించింది. ఈ సీజన్లోనే నైట్ రైడర్స్ ఓ మ్యాచ్ లో 272 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
చుక్కలు చూపించిన ఓపెనర్లు
పంజాబ్ కింగ్స్ బౌలర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ చుక్కలు చూపించారు. ఈ సీజన్లో టాప్ ఫామ్ లో ఉన్న నరైన్ తోపాటు సాల్ట్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇద్దరికీ మొదట్లోనే పంజాబ్ కింగ్స్ ఫీల్డర్లు లైఫ్ ఇచ్చారు. నరైన్ 16 పరుగుల దగ్గర, సాల్ట్ 34 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తొలి వికెట్ కు 10.2 ఓవర్లలోనే 138 పరుగులు జోడించారు. సాల్ట్ 37 బంతుల్లోనే 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 75 రన్స్ చేశాడు. మరోవైపు నరైన్ 32 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్ లతో 71 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో నరైన్ ఆరెంజ్ క్యాప్ రేసులో 357 పరుగులతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. వీళ్లు అందించిన మెరుపు ఆరంభాన్ని చివర్లో వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ జోడీ కొనసాగించడంతో నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లోనే 28 రన్స్ చేశాడు. అతడు ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 6 బాదడం విశేషం. ఇక వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లోనే 39 రన్స్ చేశాడు. మధ్యలో రసెల్ 12 బంతుల్లోనే 24 రన్స్ చేసి తన వంతు స్కోరు జత చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో నైట్ రైడర్స్ బ్యాటర్లు ఏకంగా 18 సిక్స్ లు బాదారు. అలాగే 22 ఫోర్లు కూడా ఉన్నాయి. అంటే మొత్తం బౌండరీల రూపంలోనే 196 పరుగులు రావడం విశేషం.
పంజాబ్ బౌలర్ల విలవిల
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని ఎంత పెద్ద తప్పు చేశామో తెలుసుకోవడానికి పంజాబ్ కు పెద్దగా సమయం పట్టలేదు. మొదటి నుంచీ నైట్ రైడర్స్ ఓపెనర్లు దంచి కొట్టడంతో పంజాబ్ కింగ్స్ బౌలర్లు విలవిల్లాడిపోయారు. ఆ టీమ్ కెప్టెన్ సామ్ కరన్ అయితే 4 ఓవర్లలోనే 60 రన్స్ ఇచ్చాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 45, కగిసో రబాడా 3 ఓవర్లలో 52, హర్షల్ పటేల్ 3 ఓవర్లలో 48 రన్స్ ఇచ్చారు.