Home బిజినెస్ ICICI Bank: మీకు ఐసీఐసీఐ బ్యాంక్ లో ఖాతా ఉందా? బీ అలర్ట్.. వెంటనే ‘ఐమొబైల్’...

ICICI Bank: మీకు ఐసీఐసీఐ బ్యాంక్ లో ఖాతా ఉందా? బీ అలర్ట్.. వెంటనే ‘ఐమొబైల్’ యాప్ లో ఇవి చెక్ చేసుకోండి..

0

ICICI Bank iMobile glitch: ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘ఐ మొబైల్’ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వేల సంఖ్యలో కస్టమర్లు ప్రమాదంలో పడ్డారు. వారి ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ ల వివరాలు వేరే వినియోగదారుల ‘ఐ మొబైల్’ (ICICI Bank iMobile app) యాప్ లో కనిపించసాగాయి. చాలా మంది ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులు తమకు ఇతర ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారుల క్రెడిట్ కార్డు వివరాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

సోషల్ మీడియాలో పోస్ట్ లు..

ఎక్స్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్ ఐమొబైల్ యాప్ (ICICI Bank iMobile app) లో నెలకొన్న లోపం గురించి వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది ఇతర కస్టమర్ల క్రెడిట్ కార్డు వివరాలను చూడగలుగుతున్నారని పేర్కొన్నారు. టెక్నోఫైనో వ్యవస్థాపకుడు సుమంత మండల్ ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించడానికి ఐసీఐసీఐ బ్యాంక్ ను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఐమొబైల్ పే (ICICI Bank iMobile app) యాప్ లో ఇతర కస్టమర్ల ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను చూడగలుగుతున్నట్లు చాలా మంది వినియోగదారులు నివేదించారు.

ఈ వివరాలు కనిపిస్తున్నాయి..

ఇతర వినియోగదారులకు చెందిన క్రెడిట కార్డ్ పూర్తి నంబర్, ఎక్స్ పైరీ డేట్ (EXPIRY DATE), సీవీవీ నంబర్ (CVV) ఐమొబైల్ యాప్ లో కనిపిస్తున్నాయి. వీటితో ఎవరైనా అంతర్జాతీయ లావాదేవీల కోసం మరొక వ్యక్తి క్రెడిట్ కార్డును దుర్వినియోగం చేయడం సులభం అవుతుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం మీ కార్డును బ్లాక్ చేయడం లేదా మార్చడం అని కూడా సుమంత మండల్ రాశాడు.

ఐసీఐసీఐ బ్యాంక్ స్పందన

ఈ సమస్యపై ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఇటీవల తాము జారీ చేసిన సుమారు 17,000 కొత్త క్రెడిట్ కార్డులను మా డిజిటల్ ఛానెళ్లలో తప్పుగా మ్యాపింగ్ చేశారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఐసీఐసీఐ బ్యాంక్ ((ICICI Bank) తెలిపింది. దాంతో, ఆయా క్రెడిట్ కార్డ్ యూజర్ల వివరాలు ఇతర వినియోగదారులకు కనిపిస్తున్నాయని వివరించింది. ఇవి బ్యాంకు క్రెడిట్ కార్డు పోర్ట్ ఫోలియోలో 0.1 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపింది. ‘‘తక్షణమే ఈ కార్డులను బ్లాక్ చేసి వినియోగదారులకు కొత్తవి జారీ చేస్తున్నాం. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ దుర్వినియోగం అయిన ఫిర్యాదులు మాకు ఏవీ అందలేదు. ఎవరైనా కస్టమర్ తాను ఆర్థికంగా నష్టపోయినట్లయితే బ్యాంక్ తగిన విధంగా నష్టపరిహారం చెల్లిస్తుందని మేము హామీ ఇస్తున్నాము’’ అని ఐసీఐసీఐ బ్యాంక్ హిందుస్తాన్ టైమ్స్ కు వివరణ ఇచ్చింది.

అంతర్జాతీయ లావాదేవీలు చేయవచ్చు..

ఇతరుల క్రెడిట్ కార్డు (Credit card) వివరాలు తెలిస్తే, ఆ కార్డు ద్వారా చేసే దేశీయ లావాదేవీలకు సమస్య ఉండదు. వాటికి ఓటీపీ ఆప్షన్ ఉంటుంది కాబట్టి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉండదు. కానీ, ఐమొబైల్ యాప్ లో కనిపిస్తున్న క్రెడిట్ కార్డ్ కస్టమర్ల వివరాలను ఉపయోగించి అంతర్జాతీయ లావాదేవీలను చేయడం సాధ్యమవుతుంది. ఒకవేళ, గతంలో వినియోగదారుడు ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ను డిసేబుల్ చేసినప్పటికీ.. ఐమొబైల్ యాప్ లో కనిపిస్తున్న వివరాలతో అంతర్జాతీయ లావాదేవీలను ఎనేబుల్ చేయడానికి కూడా ఈ యాప్ అనుమతిస్తుంది. దీనివల్ల కస్టమర్లు పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్ పై కస్టమర్ల ఆగ్రహం

ఐమొబైల్ యాప్ లో తలెత్తిన సమస్యపై కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్ పై పెద్ద ఎత్తున మండి పడ్తున్నారు. ‘‘వారి ప్రస్తుత సాంకేతికత అధ్వాన్నంగా ఉంది. యాప్ లో వేర్వేరు స్క్రీన్లలో వేర్వేరు డేటా కనిపిస్తోంది. ఓటీపీ, అలర్ట్ కోసం నా మొబైల్ నంబర్, వివిధ ఈమెయిల్ ఐడీలను లింక్ చేయలేకపోయానని, ఆ సమస్య పరిష్కారం కోసం బ్రాంచ్ కు వెళ్లానని, కాల్ సెంటర్ ను పలుమార్లు సంప్రదించానని, కానీ సమస్య పరిష్కారం కాలేదని ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ లావాదేవీల్లో మీరు నష్టపోతే.. వెంటనే కస్టమర్ కేర్ నెంబరు – 18002662 కు కాల్ చేయండి. లేదా, మీ క్రెడిట్ కార్డు వివరాల ద్వారా వేరే ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే, వెంటనే సైబర్ క్రైమ్ మెయిల్ ఐడీ cybercrime.gov.in కు మెయిల్ చేయవచ్చు. లేదా హెల్ప్ లైన్ 1930 కు కాల్ చేయవచ్చు. లేదా ఐసీఐసీఐ బ్యాంక్ హెల్ప్ లైన్ కు 18002662 కు కాల్ చేయవచ్చు.

Exit mobile version