posted on Apr 26, 2024 5:43PM
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి, విశాఖ ఉత్తర స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. లక్ష్మీనారాయణ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వణుకుపుట్టేలా వున్నాయి. విశాఖపట్టణంలో పోటీ చేస్తున్న తనను చంపడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణహాని వుంది కాబట్టి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని వుందని అన్నారు తప్ప, తనకు ఎవరి ద్వారా ప్రాణహాని వుందో చెప్పడం లేదు. ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆరోపణలు చేశారో కూడా అర్థం కాకుండా వుంది.
గతంలో జగన్‌ని జైలుకు పంపిన సీబీఐ మాజీ అధికారి లక్స్మీనారాయణ. అప్పటి నుంచి ఆయనకు ఒక హీరో వర్షిప్ వచ్చింది. తమ నాయకుడి చేత చిప్పకూడా తినిపించారు కాబట్టి వైసీపీ మూకలకు ఆయన మీద కోసం వుంటుంది కాబట్టి వారు హత్యాయత్నం చేసే అవకాశం వుందా అనే అనుమాలు కలగడం సహజం. అయితే జేడీ ఆ పరిస్థితి నుంచి ఏనాడో బయటపడిపోయారు. ఆమధ్య జగన్ ప్రభుత్వాన్ని, జగన్ బుర్రలోంచి ఊడిపడ్డ పరమ శుద్ధ దండగ వాలంటీర్ వ్యవస్థని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా ఆయన వైసీపీ వర్గాలకు అస్మదీయుడిగా మారారు. మరి ఇప్పుడు ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది? నన్ను హత్య చేయాలని చూస్తున్నారు. రక్షణ కల్పించడం అని కాకుండా, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన తనను ఎవరు చంపాలని అనుకుంటున్నారో క్లియర్‌గా బయట పెట్టాలి. అంతే తప్ప అర్ధోక్తిలో స్టేట్‌మెంట్లు ఇచ్చి జనాల్లో లేనిపోని అనుమానాలు కలిగేలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు.