Ullipaya Nilava Pachadi: ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ప్రతిరోజూ తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు నెలల పాటు తినవచ్చు. రెసిపీ కూడా చాలా సులువు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కూరల్లో, బిర్యానీలో, సాంబారులో… ఎలాగూ ఉల్లిపాయను వాడతాము. అలాగే ఉల్లిపాయ నిల్వ పచ్చడిని కూడా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ, ఇడ్లీలకు జతగా తినవచ్చు. అన్నంలో కూడా వేడివేడిగా కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెసిపీని ఫాలో అయితే చాలు… టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోతుంది.
ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు – అర కిలో
చింతపండు – నిమ్మకాయ సైజులో
జీలకర్ర – ఒక స్పూను
ఆవాలు – ఒక స్పూను
మెంతులు – ఒక స్పూను
నూనె – ఒక కప్పు
ఎండుమిర్చి – ఐదు
వెల్లుల్లిపాయ రెబ్బలు – 15
పసుపు – ఒక స్పూను
కారం – ఐదు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
ధనియాలు – ఒక స్పూను
ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెసిపీ
1. ఉల్లిపాయ పచ్చడి చేసేందుకు ముందుగా చింతపండును నీటిలో నానబెట్టాలి. చిక్కని గుజ్జులా మార్చి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి.
3. వాటిని మిక్సీ జార్ లోకి తీసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో కప్పు నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి.
5. ఆ తరువాత ఎండుమిర్చిని వేసి వేయించాలి.
6. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
7. ఆ తర్వాత నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కలను వేసి అవి మెత్తబడే వరకు వేయించుకోవాలి.
8. ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యాక మంటను తగ్గించుకోవాలి.
9. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి.
10. ఇది ఇగురు లాగా దగ్గరగా అవుతుంది.
11. అప్పుడు ముందుగా పొడిచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
12. అలాగే చిక్కటి చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. దీన్ని చిన్న మంట మీద ఉంచాలి. పైకి నూనె తేలే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
14. అలా నూనె పైకి తేలిందంటే పచ్చడి రెడీ అయినట్టే.
15. దీన్ని గాలి చొరబడని గాజు సీసాలో వేసుకొని నిల్వ చేసుకోవాలి.
16. బయట ఉంచితే పది రోజులు పాటు తాజాగా ఉంటుంది. అదే నెల నుంచి రెండు నెలలు తాజాగా ఉండాలంటే ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
17. దీన్ని దోశల్లో వేసుకొని తిన్నా, ఇడ్లీతో తిన్నా, అన్నంలో కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.