posted on Apr 26, 2024 2:28PM
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ముఖ్యంగా గురువారం (ఏప్రిల్ 25)న పులివెందులలో జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి, స్వయంగా ఆయన ప్రతిష్టకు తీరని నష్టం చేకూర్చాయని విశ్లేషిస్తున్నారు.
అడబిడ్డపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల సామాన్య జనంలో కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సరిగ్గా ఎన్నికల ముందు జగన్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల ప్రభావం ఒక్క పులివెందుల నియోజకవర్గానికే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట చెల్లెలి చీర రంగుపై జగన్ చేసిన వ్యాఖ్య జగన్ చేసిన పెద్ద బ్లండర్ గా అభివర్ణిస్తున్నారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైసీపీకి పెట్టని కోట లాంటి ఉమ్మడి కడప జిల్లాలో కూడా వైసీపీ ఓటమికి బాటలు పరిచాయంటున్నారు.
నిజానికి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సొంత చెల్లెలు షర్మిల, వివేకా కుమార్తె సునీత గత కొన్నినెలలుగా తనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా జగన్ ఇప్పటి వరకూ వారికి కౌంటర్ ఇవ్వలేదు. అసలు పట్టించుకోనట్లుగానే ఉన్నారు. వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా షర్మిల, సునీతలపై విమర్శలు చేశారు. వారి వ్యక్తిగత విషయాలపై కూడా కామెంట్లు పెట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ జగన్ మాత్రం ఓ మేరకు సంయమనం పాటించారు. ఇక వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా కూడా షర్మిల, సునీతల వ్యాఖ్యలు, విమర్శలపై స్పందించడం మానేసిన తరుణంలో జగన్ తన చెల్లెలి చీర రంగుపై చేసిన వ్యాఖ్యతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. సామాన్య జనం కూడా జగన్ దిగజారి మాట్లాడారని అంటున్నారు. బాహాటంగానే జగన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. షర్మిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా స్వయంగా జగన్ కే కాదు పార్టీకి కూడా తీరని నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అన్న వ్యాఖ్యలకు షర్మిల ఇచ్చిన సమాధానం జగన్ ఇప్పటి వరకూ ఓన్ చేసుకుంటూ వస్తున్న వైఎస్ వారసత్వాన్నే ఆయనకు దూరం చేసేలా ఉందని అంటున్నారు. ఇంతకీ జగన్ సంయమనం కోల్పోయి సొంత చెల్లెలని కూడా చూడకుండా ఆమె వ్యక్తిత్వాన్నే కించపరిచేలా మాట్లాడడానికి కారణం ఫస్ట్రేషనే అంటున్నారు పరిశీలకులు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వైఎస్ వివేకా హత్య కేసులో అందరి అనుమానాలూ అవినాష్ రెడ్డిపైనే ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు, కోర్టుల్లో విచారణ కూడా ఆ అనుమానాలు కేవలం అనుమానాలు కావనే విధంగానే సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ అవినాష్ ను వెనకేసుకు రావడం, చెల్లెళ్లపై ఎదురుదాడికి దిగడం, వారిని ప్రత్యర్థులు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారంటూ విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేకపోగా ప్రతికూలతే ఎక్కవగా కనిపిస్తోంది.
ఇప్పుడు తాజాగా జగన్ షర్మిల చీర రంగుపై చేసిన వ్యాఖ్యలతో ఇటీవలి కాలంలో పెద్దగా వినిపించని ప్రశ్నలు కూడా సామాన్య జనం నుంచి వినవస్తున్నాయి. వివేకా హత్య కేసులో విపక్ష నేతగా సిబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ను జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఒక వేళ అవినాష్ ఆరోపిస్తున్నట్లు వివేకా హత్యలో సునీత, ఆమె భర్త ప్రమేయం ఉంటే సునీత స్వయంగా సీబీఐ విచారణ కోరుతూ కోర్టు ను ఆశ్రయించి మరీ ఎందుకు సాధించారు. అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పులివెందులలో గురువారం (ఏప్రిల్ 25) నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ చెల్లెలి చీర రంగుపై చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలు ఎన్నిలకపై తప్పక ప్రభావం చూపుతాయని పరిశీలకులు అంటున్నారు.