Theatre releases this week: ఈ వారం థియేటర్లలో కొత్త తెలుగు సినిమాల సందడి కరువుకానుంది. ఈ వారం విడుదల కావాల్సిన తెలుగు చిత్రాలు వాయిదా పడ్డాయి. ప్రతినిధి 2, లవ్‍మీ, సీతా కల్యాణ్ వైభోగమే, శశివదనే సినిమాలు పోస్ట్‌పోన్ అయ్యాయి. దీంతో వేసవి సెలవులు నడుస్తున్నా ఈ వారం థియేటర్లలో నయా చిత్రాలు పెద్దగా రావడం లేదు. అయితే, విశాల్ నటించిన ‘రత్నం’ తెలుగు డబ్బింగ్‍లో ఈ వారం రిలీజ్ అవుతోంది.
ఈవారం విశాల్ సోలోగా..
ఈ వారం థియేటర్లలోకి వస్తున్న ప్రధానమైన చిత్రంగా ‘రత్నం’ ఉంది. ఈ సినిమా ఈ శుక్రవారం (ఏప్రిల్ 26) థియేటర్లలో రిలీజ్ కానుంది. తమిళ స్టార్ విశాల్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26నే తెలుగు డబ్బింగ్‍లోనూ రానుంది. ఈ వారం రావాల్సిన తెలుగు చిత్రాలు గంపగుత్తగా వాయిదా పడటంతో విశాల్ డబ్బింగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు సోలో రిలీజ్ లభిస్తోంది.
రత్నం సినిమా తెలుగు వెర్షన్ కోసం కూడా విశాల్ బాగానే ప్రమోషన్లు చేశారు. హైదరాబాద్‍లో ప్రెస్‍మీస్ మీట్ కుడా నిర్వహించారు. పోటీ లేకపోవడంతో అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించి బాగానే ప్రచారం చేశారు. తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సాగే యాక్షన్ మూవీగా రత్నం రూపొందింది.
రత్నం చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విశాల్‍కు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. మరి ఏప్రిల్ 26న పెద్ద పోటీ లేకుండా థియేటర్లలోకి వస్తున్న రత్నం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
లవ్‍మీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్
ప్రముఖ నిర్మాత దిల్‍రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‍మీ సినిమా ఏప్రిల్ 25వ తేదీన విడుదల కావాల్సింది. అయితే, తాజాగా ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. మే 25వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. లవ్‍మీ చిత్రాన్ని హారర్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు అరుణ్ భీమవరపు. ఈ మూవీని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. మే 25కు ఈ చిత్రం వాయిదా పడింది.
ప్రతినిధి 2 ఇలా..
నారా రోహిత్ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ కూడా ఏప్రిల్ 25నే థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ మూవీ సడెన్‍గా వాయిదా పడింది. కొత్త తేదీని కూడా మేకర్స్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే, మే తొలివారంలో ఈ చిత్రం రానుందనే అంచనాలు ఉన్నాయి. ప్రతినిధి 2 చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించారు.
శశివదనే, సీతా కల్యాణ వైభోగమే కూడా..
శశివదనే సినిమా మరోసారి వాయిదా పడింది. గతం వారమే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రాలేకపోయింది. ఈవారమైనా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా అలా కూడా జరగలేదు. శశివదనే చిత్రంలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ లవ్ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు.
ఏప్రిల్ 26న విడుదల కావాల్సిన సీతా కల్యాణ వైభోగమే చిత్రం కూడా వాయిదా పడింది. సుమన్ వూట్కూర్, గరిమా చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సతీశ్ పరమవేద దర్శకత్వం వహించారు.
వాయిదాలకు కారణం ఇదే!
ప్రస్తుతం సరైన బజ్ లేకపోవటంతో ఈవారం సినిమాలు వాయిదా పడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఓవైపు ఐపీఎల్.. మరోవైపు ఎన్నికల ఫీవర్ ప్రస్తుతం జోరుగా ఉంది. ఈ తరుణంలో సినిమాలకు పెద్దగా క్రేజ్ దక్కడం లేదు. దీంతోనే వాయిదావైపే ఆ సినిమాలు మొగ్గుచూపాయని తెలుస్తోంది. అయితే, ప్రతినిధి 2 సినిమాకు సెన్సార్ ఆలస్యం కూడా కారణమని టాక్ ఉంది. ఈ చిత్రాలు మేలో థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బాలీవుడ్ విషయానికి వస్తే ఈ వారం రుస్లాన్ రిలీజ్ అవుతోంది. ఆయుశ్ శర్మ, షుశ్రీ శ్రేయా మిశ్రా ప్రధాన పాత్రలు పోషించిన ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 26న విడుదలవుతోంది.