Bridge collapse in Peddapalli: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు వద్ద పెనుగాలులకు కుప్పకూలిన మానేర్ బ్రిడ్జి పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంట్రాక్టర్ ను ఇప్పటికే బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం, కూలీన బిడ్జికి అయ్యో ఖర్చును కాంట్రాక్టర్ నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది. పిల్లర్లు(పియర్స్) కూడా నాణ్యత లోపంతో ఉన్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు సిద్దమయ్యింది.
మొన్న వీచిన పెనుగాలులకు పెద్దపల్లి-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను కలుపుతు ఓడేడు-గరిమిళ్ళ్ళపల్లి గ్రామాల మద్య మానేర్ పై 49 కోట్ల వ్యయంతో 2016లో చేపట్టిన బ్రిడ్జి కుప్పకూలింది. బ్రిడ్జి కి సంబంధించిన మూడు గడ్డర్ లు కూలీపోవడంతో ఆర్ అండ్ బి సీఈ మోహన్ నాయక్ పరిశీలించారు. పేను గాలులకు కూలిన గడ్డర్ లను తనిఖీ చేశారు. గడర్స్ ల నిర్మాణానికి వాడిన సామాగ్రిని, రాడ్ల నాణ్యతను, పిల్లర్లను పరిశీలించి పడిపోయిన గడర్లను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం.. నాణ్యత లోపం వల్ల శ్రీ సాయి కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ను గత జనవరిలో తొలగించామని స్పష్టం చేశారు. 2016లో 49 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయలేకపోవడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే పిర్యాదులతో కాంట్రాక్టర్ ను గత జనవరిలో తొలగించడంతో పాటు కోటి 70 లక్షలు జప్తు చేశామని చెప్పారు. రెండు సంవత్సరాలుగా గడర్స్ లను కట్టె చెక్కల మీద చాలారోజులుగా పెట్టడంతో ఒకదానిపై ఒకటి వాలి గాలికి కింద పడ్డాయని తెలిపారు. చేసిన పనులకు 20 కోట్ల వరకు బిల్లు పేమెంట్ చేశామని ఇంకా 60 లక్షల రూపాయలను సంబంధిత కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సి ఉందన్నారు. జరిగిన నష్టం మొత్తం కాంట్రాక్టర్ నుంచి వసూలు చేస్తామని చెప్పారు. పిల్లర్ల నిర్మాణంలో సైతం నాణ్యత లేదంటున్నారని దాన్ని తనిఖీ చేసి నాణ్యత లోపం ఉంటే కాంట్రాక్టర్ తోనే ఆపనులకు అయ్యే ఖర్చు మొత్తం వసూలు చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు చేపడుతామన్నారు.
త్వరలోనే రీ టెండర్..
కూలిపోయిన బ్రిడ్జిని పునఃర్నిర్మించేందుకు త్వరలోనే టెండర్ పిలుస్తామని సిఈ మోహన్ నాయక్ తెలిపారు. ప్రభుత్వ అనుమతికోసం పైల్ పంపించామని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల అనంతరం బ్రిడ్జి నిర్మాణపనులు చేపడుతామన్నారు. నిర్మాణ అంచనా వ్యయం 70 కోట్లకు చేరనుంది. బ్రిడ్జి డ్యామేజ్ తో మేలుకొన్న అధికారయంత్రాంగం ఇప్పటికైనా పనులు వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే 8 ఏళ్ళుగా బ్రిడ్జి నిర్మాణం పనులు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగడంతో స్థానికులు అసహనంతో ఉన్నారు. వర్షాకాలంలోగా పనులు పూర్తి చేసేల చర్యలు చేపడితే రెండు జిల్లాల మద్య రాకపోకలకు ఇబ్బంది ఉండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టింగ్ – HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR