posted on Apr 25, 2024 3:19PM
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
హత్య కేసు నిందితులకు వత్తాసు పలుకుతున్న జగన్ పై సొంత కుటుంబీకులే విమర్శలు గుప్పిస్తుండటం, కేసు దర్యాప్తు, విచారణలో వేళ్లన్నీ వైసీపీ కడప లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి అవినాష్ రెడ్డివైపే చూపుతుండటం, ఆ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారంటూ జగన్ పై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతుండటం ఎన్నికల సమయంలో వైసీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు నుంచి గ్యాగ్ అర్డర్ తెచ్చుకున్నారు. అయితే కడప కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి, పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు బుధవారం విచారణకు రావాల్సి ఉండగా ఆ బెంచ్ న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో విచారణ వాయిదా పడింది. కొత్త బెంచ్ ముందుకు ఆ కేసు విచారణకు రానుంది.
అయితే వివేకా హత్య పై మాట్లాడకూడదంటూ కడప కోర్టు పేర్కొన్న జాబితాలో లేని సౌభాగ్యమ్మ సరిగ్గా జగన్ పులివెందులలో నామినేషన్ వేసే సమయానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో వివేకా హత్య కేసులో నిందితులకు మద్దతుగా నిలబడుతున్నావంటే సూటిగా పేర్కొని వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. వాస్తవానికి ఈ సారి ఎన్నికలలో జగన్ కు తెలుగుదేశం కూటమి మాత్రమే కాదు సొంత కుటుంబం కూడా ప్రతిపక్షంగా మారింది. వివేకా హత్యకేసులో న్యాయం కోసం పోరాడుతున్న చెల్లెళ్లనే పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తూ వారు తెలుగుదేశం స్క్రిప్టు చదువుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ విమర్శల గుప్పిస్తోంది. అక్కడితో ఆగకుండా షర్మిల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ సోషల్ మీడియాలో పేర్కొన్న అంశాలనే ఎన్నికల ప్రచార సభలలో ప్రస్తావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ జగన్ కు ఓ బహిరంగ లేఖ ద్వారా షాక్ ఇచ్చారు. ఆ లేఖ కూడా జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలోనే విడుదల చేశారు. ఆ లేఖలో నీ తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు నువ్వెంత మనోవేదన చెందావో వివేకా హత్య జరిగిన నాటి నుండి నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనకు గురయ్యింది. ఇటువంటి సందర్భంలో అన్నగా చెల్లికి అండగా నిలవాల్సిన నువ్వు ఇలా వివేకా హత్యకు కారణమైన వారికి రక్షణగా నిలవడం తగునా జగన్..? అంటూ సూటిగా ప్రశ్నించారు. సునీత కు అండగా నిలబడిన నీ సొంత చెల్లి షర్మిలను కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నువ్వు నోరెత్తకపోవడమేంటంటూ నిలదీశారు. సరిగ్గా జగన్ నామినేషన్ దాఖలు చేసే రోజునే జగన్ కు ఆమె పిన్నమ్మ బహిరంగ లేఖ రాయడం వైసీపీని దిగ్భ్రమకు గురి చేసింది.
ఆమె సూటిగా, సుత్తి లేకుండా చెల్లెళ్ల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరును ఆ లేఖలో ఎండగట్టడంతో ఆ లేఖపై ఎలా స్పందించాలో తెలియక జగన్ సహా వైసీపీ నేతలకు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అంతే కాకుండా జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, దర్యాప్తు సంస్థలు వేలెత్తి చూపుతున్న అవినాష్ రెడ్డికి రక్షణగా నిలుస్తున్న జగన్ ను తప్పుపట్టడంతో జగన్ డిఫెన్స్ లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సౌభాగ్యమ్మపై కూడా షర్మిల, సునీతమ్మల వలె ఎదురుదాడికి దిగుతుందా? ఆమెపై కూడా పెయిడ్ ఆర్టిస్ట్ ముద్ర వేస్తుందా చూడాల్సి ఉంది. జగన్ అండ్ కో మేరకు చంద్రబాబు స్క్రిప్ట్ చదివేవారి జాబితాలో ఇప్పుడు సౌభాగ్యమ్మను కూడా చేరుస్తారా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వివేకా హత్య కేసు జగన్ కు ఈ ఎన్నికల వేళ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నదనడంలో సందేహం లేదు.