Ram Double Ismart: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఆగిపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్ కోసమే రామ్ ఈ సినిమా షూటింగ్‌ను ఆపేసినట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి.
ఈ మూవీ కోసం పూరి జగన్నాథ్ అండ్ టీమ్ తనకు ఇస్తానని చెప్పిన రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లిస్తేగానే డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తిచేసేది లేదని రామ్ ఖరాఖండిగా చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ నిలిచిపోయిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే పుకార్లలో నిజం లేదని సమాచారం.
ప్రాఫిట్స్ షేర్ బేసిస్…
డబుల్ ఇస్మార్ట్ మూవీని రెమ్యునరేషన్ లేకుండా చేస్తున్నట్లు సమాచారం. ప్రాఫిట్స్ షేర్ బేసిస్ (సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా) విధానంలో చేయడానికి అంగీకరించినట్లు చెబుతోన్నారు. కేవలం టోకెన్ అడ్వాన్స్ తప్పితే రామ్‌కు పూరి జగన్నాథ్ అండ్ టీమ్ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదని సమాచారం.
పూరి జగన్నాథ్ గత సినిమాల రిజల్ట్‌లతో సంబంధం లేకుండా అతడిపై ఉన్న నమ్మకంతో రామ్ ఇప్పటికే 90 శాతానికిపైగా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్పూర్తిచేసినట్లు చెబుతోన్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్స్‌తో పాటు సాంగ్స్ షూట్, ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే బ్యాలెన్స్‌గా ఉందని అంటున్నారు.
ఫైనాన్షియల్ ఈష్యూస్…
రెమ్యునరేషన్ కోసం రామ్ షూటింగ్‌ను ఆపేసినట్లు జరుగుతోన్న ప్రచారం నిజం కాదని తెలుస్తోంది. ఎలెక్షన్స్తో పాటు ఐపీఎల్ కారణంగా ఫైనాన్షియల్ ఈష్యూస్తో చాలా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయని, అందులో డబుల్ ఇస్మార్ట్ ఒకటని అంటున్నారు. ఫైనాన్షియల్ ఈష్యూస్ క్లియర్ కాగానే ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుకాబోతున్నట్లు చెబుతోన్నారు. రామ్ కోసం నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
సంజయ్ దత్ రెమ్యునరేషన్…
డబుల్ ఇస్మార్ట్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీక్వెల్ కోసం సంజయ్‌దత్ 15 కోట్లకుపైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతోన్నారు. సంజయ్ దత్ పవర్ఫుల్ విలన్‌గా ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్‌లో హీరోయిన్ ఎవరన్నది మాత్రం మేకర్స్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు.
ఇస్మార్ట్ శంకర్…
2019లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. పరాజయాల్లో ఉన్న రామ్‌తో పాటు పూరి జగన్నాథ్‌కు ఈ విజయం ఊరటనిచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ 80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు.
లైగర్ డిజాస్టర్…
పూరి జగన్నాథ్ లాస్ట్ మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. ఈ మూవీ తాలూకు వివాదాలు ఇప్పటికీ పూరి జగన్నాథ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో జనగణమన మూవీని ప్రకటించాడు పూరి జగన్నాథ్. కానీ ఆ సినిమా షూటింగ్ అర్థాంతరంగా నిలిచిపోవడంతో డబుల్ ఇస్మార్ట్స్ను సెట్స్‌పైకి తీసుకొచ్చాడు పూరి జగన్నాథ్.