Thursday, January 23, 2025

మహేష్ బాబు అభిమానులకు గాలం.. వైసీపీ వ్యూహం విఫలం! | ycp strategy fail| provoke| mahesh| fans| against| tdp| alliance

posted on Apr 22, 2024 11:18AM

వైసీపీ గెలుపు ఆశలు వదిలేసుకుంది. పార్టీ విజయం కోసం ప్రత్యర్థి కూటమికి మద్దతు లభించకుండా చేయడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేసి తదనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. అయితే ఆ వ్యూహాలూ విఫలం అవుతుండటంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడింది. ఐదేళ్ల పాలనలో చేసిందిదీ అని చెప్పుకుని ప్రజలను ఓట్లు అడగడానికి ఒక్క అంశమూ కనిపించక.. ఇప్పుడు ప్రత్యర్థులపై విషం కక్కడం ద్వారా వారికి ఓటర్లను దూరం చేసి గెలిచేయాలన్న వైసీపీ దుష్టపన్నాగాలు పారడం లేదు. 

పోనీ గత ఎన్నికలలో సెంటిమెంట్ పండించిన కోడి కత్తి దాడిని ఈ ఏన్నికలలో మరో రకంగా తెరమీదకు తెచ్చి సానుభూతి పొందడానికి వైసీపీ చేసిన యత్నం ఘోరంగా విఫలమైంది. అంతే కాకుండా పార్టిని నవ్వుల పాలు చేసింది. ఔను గులకరాయి దాడితో హత్యాయత్నం అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చి చేసుకున్న ప్రచారం పార్టీకి ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చకపోగా ఎదురు పార్టీ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. గులకరాయి నుదుటికి తగిలిందని జగన్ వేసుకున్న ప్లాస్టర్ సైజు రోజురోజుకూ పెరుగుతుండటాన్ని నెటిజన్లు ఎత్తి చూపుతూ జగన్ ను, జగన్ పార్టీనీ ఓ ఆటాడుకుంటున్నారు. 

మరో వైపు పవన్ కల్యాణ్ తన ప్రసగంలో ప్రస్తావించిన అంశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ చేసిన యత్నం కూడా బూమరాంగ్ అయ్యింది. సినీ నటుల అభిమాన సంఘాలను రెచ్చగొట్టడం ద్వారా కూటమి అవకాశాలను దెబ్బకొట్టాలన్న వైసీపీ వ్యూహం కూడా దారుణంగా విఫలం అయ్యింది.  ఇంతకీ ఏం జరిగిందంటే… పవన్ కల్యాణ్ తన ప్రచారంలో భాగంగా అధికార వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శల దాడిని పెంచారు. జగన్ రాజకీయాలను వదిలేసి పూర్తిగా వ్యక్తిగత అంశాలనే తన ప్రచారంలో ప్రస్తావిస్తూ రోజురోజుకూ దిగజారిపోతున్నారంటూ విమర్శించారు. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుేడు  మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ  ఎన్నడూ సినీ పరిశ్రమనూ, సినీ నటులనూ టార్గెట్ చేయలేదన్న పవన్ కల్యాణ్.. జగన్ మాత్రం సినీ పరిశ్రమ, సినీ నటులను టార్గెట్ చేసి వారిని వేధించారన్నారు. సినీమా థియోటర్ల టికెట్ల రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షోలకు అనుమతులు నిరాకరణ వంటి వాటిని ఉపయోగించారు. తనపై కక్షతో మొత్తం సినీ పరిశ్రమనే జగన్ వేధించారన్నారు. ఈ సందర్భంగా గతంలో ఏ సీఎం కూడా ఇలా వ్యక్తిగత వైరం పెట్టుకుని వ్యవహరించిన దాఖలాలు లేవన్నారు. అందుకు ఉదాహరణగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హీరో కృష్ణ ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన విషయాన్ని ప్రస్తావించి, అయినా ఎన్నడూ ఎన్టీఆర్ కృష్ణను టార్గెట్ చేయలేదని చెప్పారు. 

పవన్ ఈ వ్యాఖ్యలను పట్టుకుని మహేష్ బాబు ఫ్యాన్స్ ను కూటమికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు వైసీపీ తన సోషల్ మీడియాను ఉపయోగించుకుని చేయాల్సినదంతా చేసింది.   పవన్ కళ్యాణ్ హీరో కృష్ణను అవమానించారని ఆరోపిస్తూ  మహేష్ బాబు అభిమానులను రెచ్చగొట్టేలా  వైసీపీ సోషల్ మీడియా వింగ్ నానా రచ్చా చేసింది. అయితే ఆ వ్యూహం, ఆ ప్రయత్నం ఫలించలేదు. జనసైనికులు అలర్టై  అప్పట్లో  సీనియర్ ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా తాను సినిమాలు తీసినట్లు సూపర్ స్టార్ కృష్ణ అంగీకరించిన పాత వీడియోను సామాజిక మాధ్యమంలో వైరల్ చేశారు. విశేషమేమిటంటే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తాను సినిమాలు తీశాననీ, అయినా ఎన్టీఆర్ ఎన్నడూ ఆ విషయంలో తనను అడగలేదనీ, తమ మధ్య సుహృద్భావ వాతావరణం చెడలేదనీ చెప్పిన ఆ ఇంటర్వ్యూ గతంలో జగన్ సొంత మీడియాలోనే వచ్చింది. దానినే జనసైనికులు  ప్రముఖంగా ప్రస్తావిస్తూ వైసీపీ కుట్రలను భగ్నం చేశారు. దీంతో వైసీపీ శిబిరానికి మౌనాన్ని ఆశ్రయించడం వినా మరో మార్గం లేకుండా పోయింది. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana