posted on Apr 22, 2024 9:03AM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఐదేళ్ల పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు అందరూ ఏకమవుతున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులు ఓటమి భయంతో వణికిపోతున్నారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కూటమికి మద్దతు తెలిపారు. మూడు పార్టీలు కలిసి ఏపీకి మంచి చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అని అన్నారు. అంతే కాదు.. తనను కలిసిన అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ కు మద్దతుగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వీడియో విడుదల చేశారు. చిరు కూటమికి మద్దతు పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చిరంజీవి కూడా కూటమికి మద్దతుగా రంగంలోకి దిగడంతో జగన్ సహా ఆయన పార్టీ నేతలంతా జంక్షన్ జామైపోయినట్లు ఫీల్ అవుతున్నారు. వైసీపీ పేటీయం బ్యాచ్ సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెడుతున్నది. దీనితోడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు పలకడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సజ్జల, వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేవలం వ్యక్తిగత కక్షలకే ప్రాధాన్యతనిచ్చారన్న విమర్శలున్నాయి. అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేయడం ద్వారా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి తన వ్యతిరేకులపై అక్రమ కేసులు బనాయించడం, జైళ్లకు పంపించడం, పోలీసులతో చిత్రహింసలు పెట్టించడం వంటి పనులకు మాత్రమే జగన్ ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు. సినిమా టికెట్ల విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం పెద్ద రాద్దాంతమే చేసింది. సినిమా వాళ్లు కేవలం నటులేనని, వారికి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నా వారు సీఎం దగ్గరకు వచ్చి తలవంచాల్సిందే అన్నట్లుగా సినిమా హీరోలు, సీనీ ప్రముఖుల పట్ల జగన్ ప్రవర్తించారు. సినిమా టికెట్ల విషయంలో చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాష్, రాజమౌళి వంటి వారు సీఎం జగన్ వద్దకు వెళ్లి వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో సినీ పెద్దలతోపాటు, సినీ హీరోల అభిమానులు కూడా జగన్పై ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటకువస్తూ జగన్ కు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారు. తాజాగా చిరంజీవి రంగంలోకి దిగడంతో వైసీపీ అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ పార్టీ అభ్యర్థుల్లోసైతం ఓటమి భయం పట్టుకుంది.
సీఎం జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాయి. తాజాగా చిరంజీవి సైతం కూటమికి మద్దతు పలకడంతో వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఏపీలో అభిమానులు ఎక్కువే. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తారంధ్ర జిల్లాల్లోనూ చిరంజీవిని అభిమానించేవారి సంఖ్య భారీగా ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి కూటమికి మద్దతు ప్రకటించడంతో ఇన్నాళ్లు వైసీపీకి మద్దతుగా ఉన్న చిరంజీవి అభిమానుల్లో మెజార్టీ ఓటర్లు కూటమి వైపు మళ్లడం ఖాయమన్న ఆందోళనలో వైసీపీ అభ్యర్థులు ఉన్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా రంగంలోకిదిగి చిరంజీవిపై తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది.. ఒక పక్క జగన్.. మరో పక్క తోడేళ్లు, నక్కలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇలా స్పష్టంగా చిరంజీవి మాట్లాడటం మంచిదన్నారు. చిరంజీవి లాంటివారు ఎంతమంది కూటమికి మద్దతు తెలిపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, ఈ ఎన్నికల్లో వైసీపీకి 150 సీట్లు రావడం ఖాయమని సజ్జల అన్నారు. దీంతో సజ్జల వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికి వస్తే చూస్తూ ఊరుకోను అంటూ సజ్జలకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు అనవసరంగా నోరుజారితే మిమ్మల్ని రోడ్డు మీద మోకాళ్ల మీద నడిపిస్తా అంటూ పవన్ హెచ్చరించారు. గతంలో మీకు అనుకూలంగా మాట్లాడినప్పుడు చిరంజీవి మంచి వ్యక్తి.. కూటమికి మద్దతు ఇస్తే ఆయనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? వైసీపీ నేతలూ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడండి.. మీరు కలుగుల్లో పందికొక్కులు.. ఎలుకల సమూహం.. మీరు సింహాలు కాదు అని పవన్ కళ్యాణ్ సెటైర్లు గుప్పించారు. మొత్తానికి చిరంజీవి గురించి మాట్లాడొద్దంటూ జగన్, వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే ఊరుకునేది లేదు. చంద్రబాబు కాస్త మెతక వైఖరితో ఉంటారు.. మాకేం కాదులే అనుకోకండి. అలాంటి వ్యక్తినికూడా జగన్ జైల్లో పెట్టాడు జగన్. ఇప్పుడు ఆయనకూడా మెతక వైఖరి వీడారు. నేను, చంద్రబాబు కలిసి అధికారంలోకి వచ్చిన తరువాత ఓవరాక్షన్ చేసే నేతలకు సరైన గుణపాఠం చెబుతానంటూ పవన్ హెచ్చరించారు.