posted on Apr 20, 2024 9:23AM
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన రాజదాని అమరావతి నిర్మాణాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే ఆలోచన పేరుతో అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా రాజధాని కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాటపట్టారు. కోర్టులు, కేసులతో ఐదేళ్లు గడిచిపోయాయి. అసలు రాజధానే లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నవ్వుల పాలైంది.
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొన్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో 75 శాతానికిపైగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది. జీవనాడి ఊపిరి తీసేసింది. ఇక పెట్టుబడులు, ఇతరత్రా అభివృద్ధికి సంబంధించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి అభివృద్ధి అన్న మాటకే తావులేని విధంగా మారిపోయింది. అన్ని విషయాల్లోనూ వెనుక బడి అక్షరక్రమంలో అగ్రస్థానంలో అభివృద్ధిలో అధమ స్థానంలో అన్నట్లుగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఏపీ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి, సంక్షేమాలలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న ఆశలు ఉండేవి. ఐటీ రంగంలో హైదరాబాద్ కు దీటుగా ఎదుగుతుందన్న భావన అన్ని వర్గాల్లోనూ ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా కృషి చేశారు. ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి ప్రభుత్వం మారి పోయింది.
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏమిటి? సేమ్ ఓల్డ్ స్టోరీ రాజధాని అమరావతి ఏమైందో, 75శాతం పూర్తయిన పోలవరం ఎలా పడకేసిందో.. రాష్ట్రంలో ఐటీ రంగానిది కూడా అదే కథ. అదే వ్యథ. ఐటీ శాఖ మంత్రికి గుడ్డు కథ చెప్పడంలో ఉన్న నైపుణ్యం.. రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలను ఆకర్షించడంలో లేదు.
నిజమే రాష్ట్ర విభజన సమయంలోనే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అదే అన్యాయాన్ని కొనసాగించింది. మరో వంక 2019 లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానానికి స్పీడ్ బ్రేకులు వేసి నిలిపివేశారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారంతో అభివృద్ధిని అటకెక్కించారు. ఈ రోజు ఏపీ అంటే అప్పులు. ఏపీ అంటే తిప్పలు అనుకునే పరిస్థితికి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దిగజార్చేశారు. అందుకే రాజకీయ విశ్లేషకులు, మేథావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుదు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహా యజ్ఞం కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన రావడమొక్కటే మార్గం అంటున్నారు.
చంద్రబాబునాయుడు అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభు త్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. రాజకీయ వైరుధ్యాలు, విభేదాలతో ఆయన ఘనతను మరుగుపరుద్దామన్న ప్రయత్నం అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపుదామనుకోవడమే అవుతుంది. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు… ఆయన చేసిన పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయన సంస్కరణలతో ఉద్యోగాలు సాధించుకున్న లక్షలాది మంది ఇవేం కుట్రలని బాధపడ్డారు. ఆగ్రహంతో రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఆయన వేసిన పునాదుల్ని.. ఆయన పడిన కష్టాన్ని అందరితో పంచుకుంది. అదీ చంద్రబాబు నాయుడు బ్రాండ్. రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయడానికేనని నమ్మే నాయకుడు. ఏదో గాలిలో అభివృద్ధి జరిగిపోయిందని వాదించే వారు.. ఓ అహ్మదాబాద్ ఎందుకు ఐటీ హబ్ కాలేదు.. ఓ లక్నో ఎందుకు కాలేదు.. ఓ కోల్ కతా ఎందుకు కాలేదు.. ఓ జైపూర్ ఎందుకు కాలేదు? అన్న ప్రశ్నకు జవాబు చెప్పగలరా? కానీ అశేష ఆంధ్రులు మరో ఆలోచన లేకుండా ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలరు? అక్కడ చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి లేరు అన్నదే.వారి జవాబు వచ్చిన అవకాశాల్ని అంది పుచ్చుకుని ప్రజల జీవితాల్ని బాగు చేయాలన్న సంకల్పం ఉన్న నేత అక్కడ లేరు. చంద్రబాబు ఉండటం ఏపీ ప్రజల అదృష్టం. తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా ప్రజల భవిష్యత్ ను తీర్చిదిద్దడానికి చంద్రబాబు ఉపయోగించారు. చంద్రబాబు కృషికి, ఓ తరం యువత రాత మార్చేందుకు చేసిన ప్రయత్నానికి ప్రజల హృదయాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకు నిదర్శనమే ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా దేశ విదేశాల్లో తెలుగువారున్న ప్రతి చోటా ప్రతీ చోటా వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనలు. రాష్ట్ర విభజనతో ఏమీ లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలని ఆయన కలలు కన్నారు. వాటిని ఎగ్జిక్యూట్ చేసే దశలో అధికారం కోల్పోయారు. ఐదేళ్ల కిందటితో పోలిస్తే.. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే.. ఏం కోల్పోయారో అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు చూడని పదవి లేదు.. అనుభవించని అధికారం లేదు. ఇప్పుడు ఆయన సీఎం కావడం ఆయనకు కాదు.. ఏపీకి ముఖ్యం. ఏపీ భవిష్యత్ కు ముఖ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ అంతా బైబై జగన్ అంటోంది. హ్యాపీ బర్త్ డే.. ఏపీ నీడ్స్ చంద్రబాబు !
(చంద్రబాబు జన్మదినం సందర్భంగా..)