posted on Apr 20, 2024 11:49AM
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్ లొ ఇన్వెస్ట్ చేయలేదు. ఇందుకు కారణం దేశంలో అధికంగా ఉన్న పన్నులే కారణమని ఇప్పుడు కాదు ఎప్పుడో 2021లోనే చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. స్థానికంగా పెట్టుబడులు పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని దేశంలో ప్రారంభించే సంస్థలను ఆహ్వానించడం, ప్రోత్సహించడం కోసం ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలాన్ మస్క్ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు. అందుకే ఆయన భారత పర్యటన పెట్టుకున్నారు. ఈ సంగతి తెలియగానే పలు రాష్ట్రాలు టెస్లాను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు సన్నాహాలు ఆరంబించేశాయి. దేశంలో ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్నా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచార హడావుడిలో నిండా మునిగిపోయి ఉన్నా.. రాష్ట్ర ప్రగతి కోసం మస్క్ పర్యటన సందర్భంగా టెస్లాతో ఒప్పందం కోసం సన్నాహాలు ప్రారంభించేశారు.
అయితే ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం అందుకు సంబంధించి ఇఫ్పటి వరకూ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం రాష్ట్రంలోని టెస్లాను ఆహ్వానించే విషయంలో సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో ఎలాన్ మస్క్ పర్యటన సందర్భంగా ఏపీ వైపు ఆయన దృష్టి సారించే అవకాశాలు దాదాపు మృగ్యం అన్న భావనకు అంతా వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్ హయాంలో రాష్ట్రం వైపు చూడటానికే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు భయపడిన వైనాన్ని పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. దీంతో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా పడటం సహజంగానే ఏపీ వాసులకు ఆనందం కలిగించింది.
ఈ ఏడాది చివరిలో ఎలాన్ మస్క్ భారత పర్యటనకు రానున్నారు. అంటే అప్పటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చే నెల 13న రాష్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలై తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు సీఎం అయితే టెస్లా పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువచ్చిన చంద్రబాబు.. టెస్టాను కూడా ఏపీకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన ఈ ఏడాది చివరకు వాయిదా పడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.