posted on Apr 20, 2024 11:07AM
ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ఒకటి హత్య, రెండు సాక్ష్యాల విధ్వంసం కేసులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ కేసులు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో తాను ఏ8 అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కేసు విచారణ సీబీఐ కోర్టులో కొనసాగుతోందని వివరించారు.
ఈ రెండు క్రిమినల్ కేసులూ కాకుండా అదనంతా తనపై మైదకూరులో మరో కేసు ఉందని అవినాష్ రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే తనకూ తన భార్యకూ కలిపి 25.51 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే 32.75లక్షల రూపాయల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని, అలాగే వెలమవారి పల్లె, భకరాపురం,అంకాలమ్మగూడూరులలో తన పేరుపై 27.04 ఎకరాలు ఉన్నాయని అఫిడవిట్ లో వివరించారు. ఇవి కాకుండా తన భార్యపేరుపై విశాఖ పట్నంలో, కడప జిల్లాలోని వల్లూరు, ఊటుకూరు, పొనకామిట్టలో 33.90 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు.
ఎవరి నోటీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట రాకూడదని కోర్టు ఆదేశాలున్నప్పటికీ, అవినాష్ రెడ్డి అనివార్యంలో తన ఎన్నికల అఫిడవిట్ లో ఆ హత్య కేసుకు సంబంధించి తాను ఏ8గా ఉన్నాననీ, రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయనీ పేర్కొనక తప్పలేదు. మొత్తం మీద అనివాష్ ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు కడప వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.