posted on Apr 19, 2024 11:08AM
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. తప్పులమీద తప్పులు చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికలవేళ షాక్‌లమీద షాక్‌లు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్యకర్తలుగా మార్చిన జగన్, ఎన్నికల సమయంలోనూ తన తీరు మార్చుకో లేదు. దీంతో ఈసీ కొరడా ఝుళిపించింది. వైసీపీతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు వేసింది. మరోవైపు ప్రభుత్వ సలహాదారుడి హోదాలో ఉండి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి సైతం ఈసీ షాకిచ్చింది. మంత్రులతో సమానంగా ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ప్రభుత్వ సలహాదారులకు సమాచారం చేరవేయాలని పొలిటికల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్నటి వరకు ఎలక్షన్ నియమావళితో సంబంధం లేకుండా విపక్షాలపై విమర్శలు చేసిన వైసీపీ ప్రభుత్వ సలహాదారుల నోటికి తాళం పడినట్లయింది. మరోవైపు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎస్, డీజీపీలను పక్కనపెట్టేందుకు ఈసీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో సీఎస్, డీజీపీలపై చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్న వైసీపీ మద్దతుదారులకు ఈసీ షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికల కోడ్ సమయంలోనూ కొందరు ప్రభుత్వ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. దీంతో డీజీపీ స్థాయినుంచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కింది స్థాయి అధికారులపై ఎన్నికల సంఘానికి కూటమి నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్న వారిపై ఈసీ కొరడా ఝుళిపిస్తుంది. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి రాచరిక పాలనను కొనసాగించారు. ఐదేళ్లలో జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రజల నుంచి ఎదురువుతున్న నిరసనలతో జగన్, వైసీపీ అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. జగన్ చేపట్టిన బస్సు యాత్రకుసైతం ప్రజాదరణ కరువైంది. ఈ క్రమంలోనే ప్రజల్లో మరోసారి సానుభూతి పొందేందుకు రాయిదాడి ఘటనను జగన్ తెరపైకి తెచ్చారన్న విమర్శలున్నాయి. రాయిదాడి ఘటనను రాజకీయం చేసి ప్రజల్లో సానుభూతి పొందాలని చూసిన జగన్ మోహన్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. దీంతో పోలీసులు సహాయంతో రాయిదాడి ఘటనను తెలుగుదేశం నేతలపై నెట్టేందుకు వైసీపీ పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కోడి కత్తి, వివేకానంద రెడ్డిల హత్య ఘటనలను తెలుగుదేశంపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందడం ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారికూడా అదే తరహా వ్యూహాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలపై ఈసీ కొరడా ఝుళిపిస్తున్నది.
రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ కార్యకర్తగానే వ్యవహరించారు. ప్రతిపక్షాలపై ఉద్యోగులను రెచ్చగొట్టడం, ప్రభుత్వ ఉద్యోగి హోదాలో ఉండి రాజకీయ పార్టీల నేతలపై విమర్శలు చేయడం వంటి ఘటనలు కోకొల్లలు. అయితే, ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలోనూ ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వ ఉద్యోగిని అనే విషయం మరిచి కార్యకర్తలా మారి వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం సైతం చేశాడు. గత నెల 31న ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు, మైదకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డీపోల్లో ప్రజా రావాణా శాఖ (పీటీడీ) వైఎస్ ఆర్ జిల్లా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య, మరికొందరితో కలిసి వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కరపత్రాలు పంచారు. ఈ దృశ్యాలు మీడియాలో వచ్చాయి. దీంతో తెలుగుదేశం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ స్పందించింది. చల్లా చంద్రయ్యతో పాటు 10 మందిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ , ఎన్నికల అధికారి కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన వెంకట్రామిరెడ్డి.. ఎన్నికల కోడ్ లోనూ వైసీపీ కార్యకర్తగానే వ్యవరిస్తుండటంతో ఈసీ కొరడా ఝుళిపించింది.
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపైనా వేటుకు ఈసీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం దాదాపు ఖాయమనే భావన అధికార వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇప్పటికే సీఎస్, డీజీపీపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదు వెళ్లాయి. వీరు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని, ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నాయి. దీంతో డీజీపీ, సీఎస్, మరికొందరు అధికారులపై అందిన ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ చెప్పారు. దీంతో మరో రెండుమూడు రోజుల్లో డీజీపీ, సీఎస్‌తో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ వేటువేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు ప్రభుత్వ సలహాదారులకూ ఈసీ షాకిచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో 40 మందికిపైగా ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. వీరిలో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ప్రతీనెలా ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంతో పలువురు ఈసీకి ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదులను ఈసీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ.. మంత్రులతో సమానంగా ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా పరిణామాలతో ఇకపై ఎవరైనా ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే వేటు వేసేందుకు ఈసీ సిద్ధమైంది. ఈసీ నిర్ణయంతో సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి తాళంపడినట్లయింది. ఈసీ తాజా నిర్ణయంతో సజ్జల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.