posted on Apr 18, 2024 12:36PM
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు లోని మొత్తం 39 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి స్థానాలకు, చత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్ లో ఆరు, మహారాష్ట్రలో ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
వీటితోపాటు బీహార్‌లో నాలుగు నియోజకవర్గాలకు మణిపూర్, మేఘాలయలో రెండు , మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. అంతే కాదు రాజస్థాన్ లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది, ఉత్తరాఖండ్ లో ఐదు , పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజ కవర్గాలు పోలింగ్ జరుగుతుంది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో కూడా తొలిదశలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో మొత్తం 39 నియోజవర్గాల్లో ఈనెల 19న ఒకేదఫా ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సహజంగా తమిళనాట ఎప్పుడూ ఎన్నికల గోదాలో రెండు శిబిరాలే తలపడతాయి. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మూడు కూటములు బరిలో ఉన్నాయి. ఇందులో మొదటిది డీఎంకే, కాంగ్రెస్ కూటమి. డీఎంకే ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో కూడా డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కొన్ని సీట్లు అయినా సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంది. కాగా అన్నాడీఎంకేతో తాజాగా సినీ నటుడు విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకే జత కట్టింది. డీఎండీకే కు ఐదు సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీతో అన్నా డీఎంకే తాజాగా పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుతో ముస్లిం మైనారిటీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నాడీఎంకే భావిస్తోంది. కాగా భారతీయ జనతా పార్టీ 19 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్బుమణి పట్టాళి మక్కళ్ మున్నేట్ర కజగం పది చోట్ల పోటీ చేస్తోంది. అలాగే పొత్తులో ఉన్న చిన్న పార్టీలకు కూడా ఒకటి రెండు చోప్పున బీజేపీ సీట్లు కేటాయించింది. తమిళనాడులో నిన్నమొన్నటివరకు బీజేపీకి పెద్దగా బలం కానీ, గుర్తింపు కానీ లేదు. ఒకసారి డీఎంకేతో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ ఏదో ఉనికి మాత్రంగా రాష్ట్రంలో ఆ పార్టీ ఉండేది. అయితే తమిళనాడు బీజేపీ పగ్గాలు అన్నామలై చేపట్టిన తరువాత ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై బరిలో నిలిచారు.తమిళనాడులో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం హోరెత్తించారు. దశాబ్దాల నాటి కచ్చతీవు దీవిని ప్రచారాస్త్రాంగా చేసుకున్నారు. మన భూభాగంలో భాగమైన కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసి తమిళుల ప్రయోజనాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. తూత్తుకుడిలో భారీ సభ నిర్వహించి తమిళనాడుకు వరాలు ప్రకటించారు.
ఇక యూపీ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న జాబితాలో సహరన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నూర్, నగీనా, రాంపూర్, పిల్‌భిత్ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎనిమిదిలో ముజఫర్‌నగర్, కైరానా, పిల్‌భిత్..బీజేపీ సిట్టింగ్ సీట్లు. ల్‌భిత్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న జితిన ప్రసాద్‌కు పిల్‌భిత్ టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సత్తా చూపగల ఉప ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇటీవల జయంత్ చౌధురి నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రీయ లోక్‌దళ్ కు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గట్టి పట్టుంది. అంతేకాదు ఆర్ఎల్‌డీ మద్దతుతో జాట్ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీజేపీ ఆశిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మరో ఉప ప్రాంతీయ పార్టీ భారతీయ సమాజ్ పార్టీతోనూ కమలం పార్టీకి పొత్తు ఉంది. సుహేల్‌దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ …పూర్వాంచల్ ప్రాంతంలో బలంగా ఉంది. దీంతో పూర్వాంచల్ ప్రాంతం ఓట్లు తమ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80స్థానాలనూ గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయోధ్యలో రామ జన్మభూమి మందిరం నిర్మాణం, బాల రాముడి ప్రతిష్టతో ప్రజల్లో పెరిగిన సెంటిమెంట్ ను ఓట్లుగా మరల్చుకోవాలనే లక్ష్యంతో మందుకు సాగుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఓట్లు రాలుస్తుందని భరోసాతో ఉన్నారు కమలనాథులు. కాగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు 17 సీట్లు కేటాయించింది సమాజ్‌వాదీ పార్టీ. మిగతా 63 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్యపక్షాలు పోటీ చేస్తున్నాయి.
ఇక బీహార్ విషయానికి వస్తే.. బీహార్లో మొత్తం 40 లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. కాగా ఏప్రిల్ 19న ఈ రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాలు ఔరంగాబాద్, నవాడా, గయ, జమూయ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈసారి బీహార్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. మారిన సమీకరణాల నేపథ్యంలో కొన్ని నెలలకిందటే జేడీ యూ అధినేత నితీశ్ కుమార్ రాజకీయంగా యూ టర్న్ తీసుకున్నారు. ఇండియా కూటమి నుంచి వైదొలగారు. మళ్లీ ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ అండతో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సామాన్య ప్రజల్లో నితీశ్ కుమార్‌కు అవకాశవాది అనే ముద్ర పడింది. నితీశ్ కుమార్ పొలిటికల్‌గా యూ టర్న్ తీసుకున్న తీరు ఎన్డీయే కూటమికి మైనస్ పాయింట్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ బీహార్లో మెజారిటీ యాదవ సామాజికవర్గాన్ని రాష్ట్రీయ జనతాదళ్ వైపు మళ్లించడంలో తేజస్వి యాదవ్ సక్సెస్ అయినట్లు చెబుతున్నారు. అలాగే ముస్లిం మైనారిటీలు కూడా మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా మారారని అంటున్నారు. బీజేపీ, నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీ యూ ఒక కూటమిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా జనతాదళ్ యునైటెడ్ పార్టీ 16 సీట్లలో బరిలో దిగుతోంది. కాగా బీహార్‌లో కాంగ్రెస్, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి.
ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే..ఈ రాష్ట్రంలో 48 లోక్ సభ స్థానాలున్నాయి. ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆరు పార్టీలు ప్రస్తుతం రెండు కూటములుగా ఏర్పడ్డాయి. ఒకవైపు ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన , కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ , మరోవైపు భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వర్గం ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాలను శివసేన చాలాకాలం పాటు శాసించింది. శివసేన హవా బలంగా వీచినంత కాలం మహారాష్ట్రలో బీజేపీ స్వంతంగా పాగా వేయలేకపోయింది. అయితే శివసేనలో చీలిక.. శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలికల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించింది.
ఇక రాజస్థాన్ విషయానికి వస్తే.. రాజస్థాన్‌లో మొత్తం 25 నియోజకవర్గాలున్నాయి. తొలి దశలో అల్వార్, భరత్ పూర్, బికనీర్, చురు, దౌసా, గంగానగర్, జైపూర్ అర్బన్, జైపూర్ రూరల్, ఝుంఝును, కరౌలి-ధోల్పూర్, నాగౌర్, సికార్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్ల కొకసారి రాష్ట్ర ప్రభుత్వం మారే ఆనవాయితీ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఒక టర్మ్ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. రాజుల కోటగా పేరున్న రాజస్థాన్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అడ్డాగా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్ సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. సారి కూడా క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రాజస్థాన్ లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఈ పరాజయం నుంచి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎలాగైనా బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం మీద రాజస్థాన్‌పై కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదన్నది పరిశీలకుల విశ్లేషణ.