posted on Apr 18, 2024 2:31PM
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ… బీజేపీని మించి ఎదిగిపోయారా? పార్టీ కంటే ఆయనే ప్రధానం అనే స్థాయికి కమలం క్యాడర్ వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే విశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోను చూసిన ఎవరైనా మోడీ ఫస్ట్, బీజేపీ నెక్ట్స్ అన్నట్లుగానే కమలం పార్టీ పరిస్థితి మారిపోయిందన్న అభిప్రాయానికే వస్తారని అంటున్నారు.
మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలకే పెద్ద పీట వేశారు. పదేళ్ల కాలంలో మోడీ సర్కార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామనీ, జి.ఎస్.టి వంటి సంస్కరణలు, ఆర్టికల్ 370ని రద్దు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు మోడీ ఇచ్చిన ఇచ్చిన ప్రాధాన్యత, సమాజంలోని ప్రతి వర్గానికి తాము అందజేసిన లబ్ధి వంటి వాటిని మోడీ ఘనతలుగా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మూడవసారి కూడా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అ ధికారంలోకి రావ డం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మరో అయిదేళ్ల పాటుబియ్యం ఉచితంగా సరఫరా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు బీజేపీ మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొన్నారు.
ఉమ్మడి పౌర స్మృతిని, ఒకే దేశం-ఒకే ఎన్నికలు తదితర అంశాలను అమలు చేస్తామనడమే కాకుండా, బులెట్ రైళ్లు, వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, పేదలకు మూడు కోట్ల గృహాల నిర్మాణం, పైపుతో ఇంటింటికీ గ్యాస్ సరఫరా, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ప్రధానంగా హిందుత్వ అజెండానే పొందుపరిచారు.
దాదాపుగా బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మోడీ గత పదేళ్లుగా తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకునేందుకు చేసిన ప్రకటనలు వాగ్దానాలే అనడంలో సందేహం లేదు. అయితే దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంపన్న, పేదల మధ్య పెరిగిన అంతరం, రైతుల ఆదాయం రెట్టింపు కావడం అటుంచి, వారి కష్టాలు మరింత పెరగడం వంటి అంశాల జోలికి బీజేపీ మేనిఫెస్టో పోలేదు. ఈ మేనిఫెస్టోలో ఆ దిశగా ఎటువంటి వాగ్దానాలూ లేవనే చెప్పాలి. ఉద్యోగాలను సృష్టిం, రైతుల ఆదాయం రెట్టింపు వంటి గత వాగ్దానాల గురించిన ప్రస్తావనే లేదు. దీంతో బీజేపీ పార్టీగా కంటే మోడీని మరింత ఫోకస్ లోకి తీసుకురావడం మీదనే ఎక్కువ దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.