లోక కళ్యాణంగా జరిగే రామయ్య, సీతమ్మల పరిణయ వేడుకను(Bhadrachala Ramayya Kalyanam) తనివితీరా తిలకించేందుకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భద్రాచల పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన కళ్యాణ క్రతువు మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణతో భద్రాద్రి కొండ భక్తి పారవశ్యంతో మార్మోగింది. భద్రాద్రి పట్టణం యావత్తు కళ్యాణ శోభను సంతరించుకుంది. చూర్ణిక పఠనం ద్వారా వేద పండితులు సీతారాముల కళ్యాణ కమనీయ వేడుక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. మిరుమిట్లు గొలుపుతున్న మిథిలా స్టేడియం వేదికకా శోభాయమానంగా జరిగిన కళ్యాణ వేడుకను తిలకించిన వేలాది మంది భక్తులు పులకించిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా పట్టు వస్త్రాలు, ముత్యాల తాలంబ్రాలను భద్రాద్రి రామయ్య కల్యాణానికి పంపడం విశేషం.