posted on Apr 17, 2024 12:46PM
భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కల్యాణం చూసేందుకు ఎత్తున భక్తులు భారీగా తరలి వచ్చారు. కల్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. సీఎం లేదా దేవదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో పాటు కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న ఈసీకి లేఖ రాసింది.సీఎం రేవంత్రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల కమిషన్ అవసరమైతే అధికారులు సమర్పించవచ్చునని ఈనెల 4న పేర్కొంది. అయితే లైవ్ టెలికాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని ఆంక్షలు విధించింది. ఆలయం, కల్యాణ మహోత్సవం విశిష్టత, సంప్రదాయం, చరిత్రను పరిగణనలోకి తీసుకొని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని ఈనెల 17న ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖ రాశారు.సుమారు నలభై ఏళ్లుగా కుల, మత, జాతులకు అతీతంగా దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఎట్టకేలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఒంటిమిట్టలో 22న సీతారాముల కల్యాణం
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో కోదండరాముడి వార్షిక మహోత్సవాలు నేటి నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాములవారి కల్యాణం లక్షమంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో 23న రథోత్సవం నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి