posted on Apr 15, 2024 6:28PM
కొన్నికొన్ని సందర్భాలను చూస్తే దేశంలో ఇంకా న్యాయం బతికే వుందన్న నమ్మకం కలుగుతూ వుంటుంది. లిక్కర్ కేసులో పూర్తిగా మునిగిపోయిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జపం చేసుకుంటున్నారు. అయితే ఆమెను కోర్టుకు విచారణకు తెచ్చిన ప్రతిసారీ టూమచ్ చేస్తున్నారు. కోర్టు ఆవరణలోనే మీడియాతో మాట్లాడటం, ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ.. కడిగిన ముత్యంలా, తోమిన ఇత్తడి చెంబులా బయటకి వస్తాను… లాంటి చిన్నపిల్ల చేష్టలు చేస్తూ వస్తున్నారు. ఇది చాలాకాలంగా గమనిస్తున్న వారికి చిరాకు కలిగిస్తున్న అంశం. అధికారం పోయినా, పాతాళానికి పడిపోయినా వీళ్ళ తీరు మారదా అన్న ఏహ్యభావం కలుగుతోంది. ఈరోజు కోర్టుకు హాజరైన కవిత తన పాత ధోరణిలోనే ‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ’ అనడాన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడ్డం, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడం మీద హెచ్చరించింది. కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో కవిత ఇకముందు అలాంటి వ్యాఖ్యలు చేయడం, మీడియాతో మాట్లాడ్డం చేయకపోవచ్చు.
ఒక విషయంలో కోర్టు పుణ్యమా అని కవిత కంట్రోల్లోకి వచ్చేశారు. అయితే కవితను మరో విషయంలో కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం వుంది. అది మాటమాటకీ ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేయడం.
‘జై తెలంగాణ’ అనే పదం చాలా పవిత్రమైన పదం. తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్ల గొంతుకలు నినదించిన పదం. ఆ పదాన్ని అదేదో తమ కుటుంబం ఆస్తిలాగా కవిత వినియోగిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవిత ‘జై తెలంగాణ’ పదాన్ని వినియోగించడం ఎంతమాత్రం బాగాలేదు. తమ సొంత సమస్యని మొత్తం తెలంగాణకు ఆపాదించడానికి కవిత ఈ పదాన్ని మాటమాటకీ ఉపయోగిస్తున్నారన్నది స్పష్టం. ‘జై తెలంగాణ’ పదం తెలంగాణలోని ప్రతి ఒక్కరిది. లిక్కర్ స్కామ్ మాత్రం కేవలం కల్వకుంట కవితది. కవిత ఈ పదాన్ని ఉపయోగించకుండా చేసేదెవరో! కవిత నోరు మూత పడేదెన్నడో!