posted on Apr 15, 2024 6:50AM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వార్ వన్‌సైడ్ గా మారింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజాదరణ పెరుగుతోంది. ప్రముఖ సర్వేలన్నీ కూటమి విజయం తధ్యమని తేల్చేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. దీంతో జగన్ తన క్రిమినల్ మైండ్ కు పనిచెప్పినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. విజయవాడలో బస్సుయాత్ర సమయంలో జగన్‌పై జరిగిన గులక రాయి దాడి ఘటన జగన్ క్రిమినల్ మైండ్‌లో భాగమేనని కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో సానుభూతి కోసం జగన్ మోహన్ రెడ్డి హత్యారాజకీయాలకు తెరలేపుతారని విపక్ష పార్టీల నేతలు ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలు ఉదాహరణగా చూపుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఊహించినట్లుగానే జగన్‌పై రాయి దాడి జరగడం.. అదంతా చంద్రబాబు చేయించారని వైసీపీ విస్తృత ప్రచారం చేయడంతోపాటు.. ఆ పార్టీ నేతలు మీడియా ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ప్లాన్ ప్రకారం జరిగినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల తరహాలో ప్రజల్లో సానుభూతి కోసమే జగన్ ఈ తరహా రాజకీయాలకు మరోసారి తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇలాగే వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. కోడికత్తి దాడి, వివేకానంద రెడ్డి హత్య ఘటనలు వైసీపీ కుట్రలో భాగమేనని అప్పట్లోనే విమర్శలున్నాయి. ఆ తరువాత జరిగిన దర్యాప్తులలో కూడా ఆ ఘటనల వెనుక ఉన్నది వైసీపీయే అని తేలింది. అప్పట్లో అధికారంలో తెలుగుదేశం ఉంది. అప్పట్లో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ, కోడికత్తి దాడి, వివేకానంద రెడ్డి హత్య ఘటనలకు చంద్రబాబే కారణమని ప్రజలను నమ్మించడంలో వైసీపీ విజయవంతమైంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికే కోడికత్తి దాడి, వివేకానంద రెడ్డి హత్య ఘటనల్లో తెలుగుదేశం ప్రమేయం లేదని స్పష్టమైంది. మరోవైపు జగన్ ఐదేళ్ల ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారు. దీంతో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఓటు ద్వారా గద్దెదింపేందుకు సన్నద్ధంగా ఉన్నారు. దీంతో మరోసారి సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించేందుకు జగన్ తన క్రిమినల్ మైండ్ కు పనిచెప్పారని, అందులో భాగంగానే జగన్‌పై గులక రాయి దాడి ఘటన అని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జగన్ రెడ్డిపై గులక రాయితో దాడి చేశారని వైసీపీ ప్రారంభించిన క్షుద్ర రాజకీయం ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక రాళ్ల దాడులకు దారి తీస్తోంది. ఇలాంటి ఘటనలు అడ్డుకోవాల్సిన ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారిపోయారని ఏడాది కాలంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు మొత్తుకుంటున్నారు.. ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లానే వ్యవహరిస్తున్నారని, జగన్ క్రిమినల్ మైండ్ కు అనుకూలంగా వారు పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్‌పై గులక రాయి దాడి ఘటన తరువాత వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. గాజువాకలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఆయన వాహనం వెనుక గుండా వచ్చి దుండగులు రాయి విసిరారు. అనంతరం వారు పక్క సందులోకి పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పోలీసులను దాటుకొని వచ్చి జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబుపై దాడికి ప్రయత్నించడం అంటే పోలీసుల ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ పలువురు పోలీస్ అధికారులు వైసీపీ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారనడానికి ఇదో ఉదాహరణ అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, రాయి దాడి తరువాత చంద్రబాబు మాట్లాడుతూ.. నిన్న చీకట్లో సీఎంపై గులక రాయి పడింది.. ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడే నాపై రాయి విసిరారు. క్లెమోర్ మైన్స్ కే భయపడలేదు.. ఈ రాళ్లకు భయపడతానా అన్నారు. జగన్‌పై దాడిని అందరం ఖండించాం.. కానీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారంగా మెరుగుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై దాడి జరుగుతుంటే పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు.. దాడులు చేస్తే చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా తెనాలి పర్యటనలో జనసేన అధినేత పవన్ పైనా ఓ వైసీపీ కార్యకర్త రాయి దాడికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
జగన్ పై రాయిదాడి జరిగినప్పుడు ఆయన పక్కన ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, జగన్ పక్కనఉన్న పోలీసులను ఏమైనా అంటే వైసీపీ నేతలకు కోపం వస్తుంది. జగన్‌పై రాయిదాడి ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని సజ్జల అనడం గమనార్హం. వైసీపీ నేతలు పోలీసులను వెనుకేసుకు రావడానికి కూడా కారణముందట. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఈసీ భావిస్తున్నది. కానీ, ఓటమి భయంతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని, తద్వారా మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారనితె లుగుదేశం, జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పూర్తిగా జగన్ కనుసన్నల్లోనే పనిచేస్తుందన్న విమర్శలు ఉన్నాయి.
పోలీసుల వ్యవస్థ జగన్ కు దాసోహం అంటుంటే.. రాష్ట్రంలో మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేసేదెవరన్న ప్రశ్న ఏపీ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఈసీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై వేటు వేయాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. అలా చేయకుండా జగన్ నియమించుకున్న పోలీసు అధికారుల ద్వారానే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఈసీ భావిస్తే అదిజరిగే పనికాదన్నవిషయం తాజా ఘటనలతో స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈసీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి వైసీపీ అనుకూల పోలీసులపై కొరడా ఝుళిపిస్తే తప్ప ఎన్నికల ప్రశాతంగా జరగవనే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.