posted on Apr 15, 2024 3:26PM
ఎపిలో అధికారపార్టీ ప్రజల భద్రత కన్నా పాలకుల భద్రత మీద దృష్టి కేంద్రీకరించింది. .
ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు. బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీ స్థాయి అధికారులతో భద్రతను కల్పించనున్నారు. సీఎం ప్రయాణించే రోడ్డు మార్గాన్ని సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్ లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో సెక్యూరిటీ కల్పించారు. ఇక నుంచి నిర్దేశించిన మార్గాల్లోనే సీఎం రోడ్ షోలు, సభలు ఉంటాయి. పువ్వులు విసరడం, గజమాలల విషయంలో ఆంక్షలు విధించారు. మరోవైపు జగన్ మేమంతా సిద్ధం యాత్ర గన్నవరం నియోజకవర్గం నుంచి గుడివాడ నియోజకవర్గంలోని ప్రవేశించింది. ఈ సాయంత్రం గుడివాడలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. గాయం కారణంగా వైద్యుల సలహాతో జగన్ ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.