posted on Apr 13, 2024 4:00PM
పుంగనూరు అనే పేరు వినగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది పుంగనూరు జాతి ఆవులు, ఎడ్లు. చాలా చిన్న ఆకారంతో, మనుషులతో కలసిపోయే స్నేహశీలతతో, ఆరోగ్య విలువలు వున్న పాలిచ్చే పుంగనూరు పశుసంపద ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పుంగనూరు ఆవుల ద్వారా వచ్చే పాలతోనే తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టే ప్రసాదాన్ని తయారు చేస్తారంటే, పుంగనూరు జాతికి వున్న పవిత్రతను అర్థం చేసుకోవచ్చు.
అలాంటి మంచి పేరున్న పుంగనూరు పరువును తీసిపారేసే బృహత్తర కార్యక్రమాన్ని వైసీపీ, నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి చేపట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పుంగనూరు పేరు చెబితే సాధు జీవులైన ఆవులు గుర్తుకు రావడం మానేసి, అన్యాయాలతో, ఆరాచకాలతో రెచ్చిపోతున్న పెద్దిరెడ్డి మనుషులు గుర్తొస్తారు. పెద్దిరెడ్డి వర్గీయులు పుంగనూరులో చేయని దారుణం లేదు.
ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను చావగొట్టడం, వారి వాహనాలను ధ్వంసం చేయడం వాళ్లకి బాగా అలవాటైపోయింది. ఏయ్ బిడ్డా… పుంగనూరు నా అడ్డా అన్నట్టు పుష్ప లెవల్లో పెద్దిరెడ్డి అండ్ కో రెచ్చిపోతున్నారు. గతంలో పెద్దమనిషిగా పేరున్న పెద్దిరెడ్డి ఇప్పుడు పేరులోనే పెద్దతనాన్ని మిగుల్చుకున్నారు. ఈసారి ఎన్నికలలో పెద్దిరెడ్డికి బుద్ధి చెప్పడానికి పుంగనూరు నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా వున్నారు.