posted on Apr 13, 2024 5:29PM
కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చేస్తున్నారని రెండు మూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చర్చను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియా పులులు ఎవరికి తోచిన పులిహోర వాళ్ళు కలిపేసుకుంటున్నారు.
ఈ పులిహోర ప్రహసనం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం పులివెందుల పులిబిడ్డ షర్మిల. కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఈమధ్య ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, తన ధాటికి భయపడిపోయిన జగనన్న కడప అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చబోతున్నారని కాస్త ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. అంతే, అక్కడ నుంచి ఈ వార్త దావానలంలా మారిపోయి, జగన్ నిజంగానే అవినాష్ రెడ్డిని మార్చబోతున్నారని చాలామంది నమ్మేశారు.
ఇంకొంతమంది అత్యుత్సాహవంతులు అదిగో పులి అంటే, ఇదిగో తోక అన్నట్టుగా దీనికి మరింత మసాలా జోడించి, కడప పార్లమెంట్ స్థానం నుంచి మిసెస్ భారతీ జగన్ పోటీ చేయబోతున్నారని ప్రచారం ప్రారంభించారు. ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే కడప అభ్యర్థిని మార్చే అవకాశం ఎంతమాత్రం లేదు. కాకపోతే, ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.